‘ఇ– రక్షాబంధన్‌’ను ప్రారంభించిన సీఎం జగన్..!

మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి సీఎం జగన్ చర్యలు చేపట్టారు. రాఖీ పండుగ సందర్భంగా ఆయన ’ఈ-రక్షాబంధన్’ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మహిళలకు అవగాహన కోసం 4s4u.appolice.gov.in అనే పోర్టల్ ను ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో రాబోయే నెల రోజుల పాటు ఈ వెబ్ ఛానల్ ద్వారా నిపుణులతో అవగాహన కల్పిస్తారన్నారు. సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు, హెరాస్ మెంట్ ను ఎలా ఎదుర్కోవాలి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఏయే యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏ యాప్స్ వల్ల ఇబ్బందులు వస్తాయి అన్న దానిపై కూడా అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. 

 ఇవి కాక మహిళలకు ఏదైనా సమస్య ఉంటే దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాులు చేయాలని కోరారు. దిశ చట్టం కోసం రాష్ట్రప్రభుత్వ పరంగా చేయాల్సినవి చేశామని, రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. 

రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం లేదన్నారు. అధికారంలోకి రాగానే 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు ఇచ్చామన్నారు. నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ కాంట్రాక్టులు, సర్వీసుల్లో వారికి యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు. అమ్మ ఒడి , వసతి దీవెన, ఆసరా, చేయూత, 30 లక్షల ఇళ్లపట్టాలు కూడా మహిళలకే ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15న వారి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నామన్నారు. 33 శాతం మద్యం దుకాణాలను తగ్గించామని సీఎం జగన్ వెల్లడించారు. 

Leave a Comment