‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’(APCOS) ప్రారంభించిన జగన్

ఉద్యోగం కావాలా అయితే మాకింత ఇవ్వాలి..ఏజెన్సీలు అడిగే మాట ఇది..ఇపుడు ఆ రోజులు పోయాయి. లంచం లేకుండా ఔట సోర్సింగ్ ఉద్యోగం పొందవచ్చు. ఎవరికీ చిల్లిగవ్వ ఇవ్వాల్సిన పని లేదు.  జగనన్న ప్రభుత్వం ఏర్పడ్డాక దళారీతనం, లంచగొండితనం, అతినీతి నిర్మూలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అందులో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను సీఎం జగన్  ఏర్పాటు చేశారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్ డ్ సర్వీసెస్(APCOS) ప్రారంభించారు. 

కార్పొరేషన్‌ లక్ష్యం..

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు పూర్తిగా చెల్లించడంతో పాటు, ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేయడం. ఇంకా ఆయా ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, వాటన్నింటిలో మహిళలకు 50 శాతం ఇవ్వడం కూడా ఆప్కాస్‌ లక్ష్యం. 

ఆప్కాస్‌ ప్రధాన విధులు..

  •  పూర్తి పారదర్శక విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌ స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌ గుర్తింపు.  
  •  వివిధ శాఖలు, సంస్థల అవసరాలు తీర్చే విధంగా పూర్తి శాస్త్రీయ కోణంలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది ఎంపిక.
  •  ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా ఆ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పూర్తి వేతనాలు అందేలా చూడడం.
  •  చట్టబద్ధంగా వారికి ఉన్న సదుపాయాలు.. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)తో పాటు, ఈఎస్‌ఐ వంటివి అందేలా చేయడం.
  •  హౌజ్‌ కీపింగ్, సెక్యూరిటీ, కేటరింగ్, వాహనాల అద్దె వంటి కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలను గుర్తించి, వారి అవసరాల మేరకు ఉద్యోగులను ఆప్కాస్‌ ద్వారా అందించండి. 
  •  రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు, కార్యాలయాల్లో అవసరమైన ఔట్‌ సోర్సింగ్‌ ప్రక్రియలన్నింటికీ ‘వన్‌–స్టాప్‌–షాప్‌’ గా ఆప్కాస్‌ పని చేస్తు్తంది.

కార్పొరేషన్‌తో ప్రయోజనాలు..

  •  ప్రైవేటు ఔట్‌ సోర్సింగ్‌ సంస్థలు, దళారులు తొలగిపోతారు.
  •  అవినీతి లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకం.
  •  వాటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఉద్యోగాలు, మళ్లీ వాటిలో మహిళలకు 50 శాతం ఉద్యోగాలు.
  •  ఎలాంటి కోతలు లేకుండా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందికి ఠంచనుగా నెల నెలా పూర్తి వేతనాల చెల్లింపు.
  •  ఉద్యోగులకు ఉన్న సదుపాయాలు.. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటివి అందుతాయి.
  •  పారదర్శకంగా ఏ విధమైన కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా ఉద్యోగుల నియామకం.

మార్గదర్శకాలు ఇవే..

  • ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందిని కార్పొరేషన్‌ పరిధిలోకి మారుస్తారు.
  •  ఇక నుంచి కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ ఆప్కాస్‌ మాత్రమే ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
  •  ఇప్పుడు ఔట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని తొలగించరు.
  •  ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా ఒక యూనిక్‌ కోడ్‌ ఇస్తారు.
  •  రిజర్వేషన్ల ప్రక్రియను పక్కాగా అమలు చేస్తారు.
  •  కార్పొరేషన్‌ పరిధిలోకి ఆయా ఉద్యోగులను బదలాయించే సమయంలో వారి పే స్లిప్‌లు, బ్యాంక్‌ ఖాతాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐకి సంబంధించిన ఖాతాల వివరాలు సేకరిస్తారు.
  •  కార్పొరేషన్‌ పరి«ధిలోకి ఆయా ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సమీక్షించడానికి జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.
  •  ఆ కమిటీకి జిల్లా కలెక్టర్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గానూ, ఆ సంస్థల నుంచి ఒక ప్రతినిధి కమిటీ మెంబర్‌గా ఉంటారు.
  •  ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలు, మైనారిటీలకు 29 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు. వాటన్నింటిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. 
  •  ఈ రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షిస్తాయి.
  •  అవసరమైతే కొత్త అభ్యర్థులను కూడా జిల్లా స్థాయి కమిటీలు సూచిస్తాయి. వారి పేర్లను కార్పొరేషన్‌ ఆప్కాస్‌కు పంపాల్సి ఉంటుంది.

వేతనాల చెల్లింపు ఇలా..

ఆప్కాస్‌కు కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది బదలాయింపు తర్వాత వారి వేతనాలన్నీ ఆ కార్పొరేషన్‌ ద్వారానే చెల్లిస్తారు. ఆయా శాఖలు, విభాగాలు సంస్థలు, కార్యాలయాలు నేరుగా ఆ ఉద్యోగులకు వేతనాలు చెల్లించవు. ఉద్యోగులు, సిబ్బందిని నియమించుకున్న సంస్థలు, శాఖలు, విభాగాలు, కార్యాలయాలు ప్రతి నెలా ఆ మేరకు వారి వేతనాలు, ఇతర సదుపాయాలకు సంబంధించిన బిల్లులను ఏపీసీఓఎస్‌కు చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Comment