నిరుపేద మిత్రుడికి ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన క్లాస్ మేట్స్..!

స్నేహం ఎంతో గొప్పది. స్నేహితులు లేని వారు ఎవరూ ఉండరు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు తోటి స్నేహితుడిని ఆదుకునే వాడే నిజమైన స్నేహితుడు. బాధల్లో ఉన్నప్పుడు ఆత్మీయంగా గెండెకు హత్తుకునే వారే అసలైన మిత్రుడు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎంతో మంది తారసపడతారు. అందులో కొందరే స్నేహితులుగా మిగిలిపోతారు. తాజాగా తమిళనాడులోని అలాంటి స్నేహమే కనిపించింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్నేహితుడికి ఇల్లు బహుమతిగా ఇచ్చారు. 

తమిళనాడులోని పుడుక్కొట్టైకి చెందిన 44 ఏళ్ల ముత్తుకుమార్ ట్రక్ డైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా వైరస్ లాక్ డౌన్ అతడు తన ఉపాధి కోల్పోయాడు. లాక్ డౌన్ కు ముందు ముత్తు ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదించేవాడు. కానీ లాక్ డౌన్ అతని ఆదాయం రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు పడిపోయింది. 2018లో వచ్చిన గజా తుఫాన్ అతడి గుడిసే బాగా దెబ్బతింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ముత్తు గుడిసెకు మరమ్మతులు చేయించలేదు. అది కూలిపోయే స్థితికి వచ్చింది. అయినా అందులోనే ఉంటున్నాడు.

ముత్తు సెప్టెంబర్ నెలలో తమ పాఠశాల ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ తన స్కూట్ మేట్ నాగేంద్రన్ ను కలిశాడు. తర్వాత ముత్తు తన స్నేహితుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ముత్తుకుమార్ ఇంటి పరిస్థితి చూసి నాగేంద్రన్ బాధపడ్డాడు. తన స్నేహితుడు ఏంటీ ఈ పరిస్థితుల్లో ఉన్నాడంటూ కలత చెందాడు. 

ఎలాగైన తన స్నేహితుడికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు నాగేంద్రన్. ఆ ఇంటి ఫొటోలు తీసి తమ స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేశాడు. అంతే అతనికి సహాయం చేయడికి చాలా మంది స్నేహితులు ముందుకు వచ్చారు. స్నేహితుల నుంచి మొత్తం రూ.1.5 లక్షలు పోగయ్యాయి. వాటి ద్వారా మూడు నెలల్లో ఇల్లు నిర్మించారు. దీపావళి కానుకగా ముత్తుకుమార్ కు ఇంటిని నిర్మించి ఇచ్చారు. అంతే కాదు ఆ ఇంటికి సమీపంలో ముత్తు తల్లికి ఓ గుడిసెను కూడా నిర్మించారు.  

 

Leave a Comment