ఇంట్లో నుంచి పారిపోయి.. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు..!

సాధారణంగా అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ చిగురించడం సహజం.. ఆడ మగ మధ్య ఆకర్షణ, ఆడ మగ పెళ్లి అనేది ప్రకృతి ధర్మం.. కానీ ఇవన్నీ ఒకప్పటి మాటలు.. ఇప్పుడు దారులు మారాయి. ఆలోచన ధోరణి మారింది. ఎవరి ఆలోచనలకు తగ్గట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలో లెస్బియన్, గే, ట్రాన్స్ జెండర్ల కల్చర్ పెరిగిపోయింది. అబ్బాయిలు అబ్బాయిలను.. అమ్మాయిలు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు.. ఇటీవల ఇద్దరు మగాళ్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. 

తాజాగా ఇద్దరు అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన రాజస్తాన్ రాష్ట్రం చురు జిల్లలోని రతన్ గఢ్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు హరియాణాలోని జింద్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి ఏడాది క్రితం రతన్ గఢ్ లోని తన సోదరి అత్తారింటికి వచ్చింది. ఈక్రమంలో తన సోదరి ఆడపడుచు(18)తో ఆ యువతికి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. 

ఈ విషయం ఇంట్లో తెలిసి.. వారిద్దరినీ కలుసుకోకుండా చేశారు. అయితే గత ఏడాది నవంబర్ లో రతన్ గఢ్ కి చెందిన యువతి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చేసింది. హరియాణాలోని అదంపూర్ మండీకి చేరుకుని తన ప్రేయసి అయిన మరో యువతిని కలిసింది. ఇద్దరు కలిసి ఫతేబాద్ లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జింద్ లో గత రెండు నెలలుగా కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. 

అయితే తన కుమార్తె కనిపించడం లేదని రతన్ గఢ్ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జనవరి 12న పోలీసులు ఇద్దరు యువతులను గుర్తించారు. మీరు చేసేది ప్రకృతికి విరుద్ధమని, మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఆ యువతులు మాత్రం తమ నిర్ణయం మార్చుకోమని తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు వారిని పంపేశారు.  

Leave a Comment