పిల్లల ఆకలి తీర్చేందుకు కిడ్నీలు అమ్ముతున్న తండ్రులు..!

అఫ్ఘనిస్తాన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల పాలనలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేందుకు పనిలేకపోవడంతో.. డబ్బు లేక తినేందుకు తిండి లేక అవస్థలు పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఆకలిలో అలమటిస్తున్నారు. చిన్నారుల ఆకలి తీర్చేందుకు తండ్రులు తమ జీవితాలనే పణంగా పెడుతున్నారు. తమ శరీర భాగాలను అమ్ముకుని పిల్లల కడుపు నింపుతున్నారు.. 

అఫ్ఘన్ లో ఆర్థిక సంక్షోభం కారణంగా హెరాత్ ప్రావిన్స్ లో కొన్ని నెలలుగా కిడ్నీల అమ్మకాలు పెరిగిపోయాయి. బయటకు వెళ్లి అడుక్కోలేక తమ కిడ్నీలను అమ్ముకుంటున్నారు. తన కిడ్నీని రూ.1.69 లక్షలకు అమ్మేసినట్లు గులాం హజ్రత్ అనే వ్యక్తి చెప్పాడు. ఆ డబ్బుతో తన పిలల్లకు కొంత కాలమైనా తిండి పెడతానని అంటున్నాడు. అఫ్ఘన్ లో చాలా మంది తండ్రులు ఇదేవిధంగా కిడ్నీలు అమ్ముకుంటున్నారు. 

కిడ్నీ కోల్పోతే ఎన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే వీటిని అఫ్ఘన్ లు లెక్కచేయడం లేదు. తమ కుటుంబ పోషణకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కిడ్నీ తీసేశాక కనీసం ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయినప్పటికీ వారు ఎవరినీ లెక్కచేయకుండా రెండు నెలలకే పనులు చేసుకునేందుకు వెళ్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రాణభయంతో దేశం వదిలి వెళ్లిపోయారు..

అఫ్ఘన్ లో సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అఫ్ఘనిస్తాన్ లో 2.28 కోట్ల మందికి ఆహార కొరత ఉందని డబ్ల్యూఎఫ్పీ ప్రతినిధి మేరీ ఎల్లెన్ మెక్ గ్రోర్టీ పేర్కొన్నారు. వీరిలో 87 లక్షల మంది ఆకలిచావులకు దగ్గరగా ఉన్నారని వాపోయారు. ప్రపంచ దేశాలన్నీ మానవతా సాయం అందించాలని మెక్ గ్రోర్టీ కోరారు. 

Leave a Comment