యూట్యూబ్ లో నేర్చుకుని..రూ.10 లక్షలు కొట్టేసిన బాలుడు..!

ఈరోజుల్లో స్కూల్, కాలేజీ అన్ని యూట్యూబ్ అయిపోయింది. ఏ విషయం తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో చూస్తున్నారు. ఎందుకంటే యూట్యూబ్ లో ప్రతి విషయం గురించి ఉంటుంది. కొందరు మంచి కోసం ఉపయోగిస్తుంటే.. మరి కొందరు చెడు కోసం యూట్యూబ్ ను ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్ లో చూసి మోసాలకు పాల్పడుతున్నారు. 

తాజాగా ఓ 17 ఏళ్ల బాలుడు మోసాలు ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాడు. ఏటీఎం కేంద్రాల వద్దకు వచ్చే వృద్ధులను టార్గెట్ గా చేసుకున్నాడు. అలా ఇప్పటి వరకు రూ.10.52 లక్షలు కొట్టేశాడు. ఈ బాలుడిని చిత్తూరు పోలీసులు శుక్రవారం చిత్తూరు అరెస్ట్ చేశారు. అతడి వద్ద రూ.3 లక్షల విలువ గల బైక్, ఏటీఎం కార్డ్స్, రూ.65 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. 

వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జు గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడిని మాట వినకపోవడంతో అతడి తల్లిదండ్రులు వదిలేశారు. అప్పటి నుంచి ఈజీగా మనీ సంపాధించాలని అనుకున్నాడు. దీని కోసం మోసాలు చేయడం ప్రారంభించాడు. ఏటీఎంల వద్దకు వృద్ధు వస్తే డబ్బులు విత్ డ్రా చేస్తానని చెప్పి అసలైన కార్డు తీసుకుని పిన్ నెంబర్ తెలుసుకుని.. నకిలీ ఏటీఎం కార్డు వారికి ఇచ్చేవాడు. అలా 2018 నుంచి ఏపీ, తెలంగాణలోని ప్రాంతాల్లో ఏటీఎం కార్డులతో మోసాలకు పాల్పడుతూ రూ.10.52 లక్షలు కాజేశాడు. 

కాజేసిన డబ్బులతో జల్సా చేసేవాడు. విమానాల్లో తిరుగుతూ స్టార్ హోటళ్లలో బస చేసేవాడు. గతనెల చిత్తూరులో ఏటీఎం వద్ద ఓ వృద్ధురాలి ఏటీఎం కార్డు తీసుకుని పరారయ్యాడు. తర్వాత ఆమె అకౌంట్ నుంచి 70 వేల రూపాయలు విత్ డ్రా చేశాడు. వృద్ధురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని తిరుపతి జువైనల్ హోమ్ కు తరలించారు.   

Leave a Comment