కరోనాను మతానికి అంటగట్టొద్దు : చంద్రబాబు

 ముస్లింలపై డిప్యూటి సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. నారాయణ స్వామిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని తన నివాసం నుండి  చంద్రబాబు సోమవారం టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ‘‘ఎంగిలి ప్లేట్లు, స్పూన్లు ముస్లింలు నాకడం వల్లే కరోనా వ్యాపిస్తోందని’’ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి వ్యాఖ్యానించడం గర్హనీయమని అన్నారు. ‘ఢిల్లీ జమాత్ వల్లే ఏపిలో కరోనా వ్యాపించిందని’’ సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదికి ఫిర్యాదు చేశారని, ముస్లింల పట్ల వైసిపి నేతల దుర్మార్గ వైఖరికి ఈ వ్యాఖ్యలే రుజువని ఆయన అన్నారు. కరోనా మహమ్మారిని ఏదో ఒక మతానికి అంటగట్టాలని చూడటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.  ముస్లింలపై వైసిపి నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.

రాజకీయ ప్రయోజనాలే జగన్ కు ముఖ్యం

ఏపీ సీఎం జగన్ కు ప్రజల ప్రాణాల కంటే రాజకీయ లాభాలే ముఖ్యమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ తొలగింపును తీవ్రంగా ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను రమేష్ కుమార్ కాపాడితే ఆయనను పదవి నుంచి తొలగించడం దుర్మార్గ చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక రాజ్యాంగ సంస్థ అధిపతిని అప్రజాస్వామికంగా తొలగించడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు. 

ఎపిలో క్వారంటైన్ ను ఒక ఫార్స్ గా మార్చారని, తమకు నచ్చిన వారిని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారని విమర్శించారు. కనగరాజ్ చెన్నై నుంచి రావడానికి, కాంట్రాక్టర్లు హైదరాబాద్ నుంచి రావడానికి లేని అభ్యంతరాలు సామాన్య ప్రజలకు, వలస కార్మికులకు రాష్ట్రాల సరిహద్దులు దాటడానికి ఎందుకు వస్తున్నాయని చంద్రబాబు ప్రశ్నించారు. 

పనులు కోల్పోయిన పేదలకు కుటుంబానికి రూ 5వేలు ఇవ్వాలని రాష్ట్రంలో వైసిపి మినహా అన్ని పార్టీలు కోరినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. కరోనా మరణాలను దాచిపెట్టడం వల్ల మరింత కీడు వాటిల్లుతోందని ఆయన విమర్శించారు. కరోనా మరణం దాచిపెడితే వాటిల్లే దుష్ఫలితాలకు విజయవాడ ఉదంతమే రుజువు అని వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని జిల్లా ప్రాతిపదికగా విశ్లేషించాలే తప్ప, మండల ప్రాతిపదికన తక్కువగా చూపించడం దురుద్దేశ పూర్వకంగా పేర్కొన్నారు. ఏపిలో కరోనా కేసులపై ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో జగన్  కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. లాక్ డౌన్ లో కూడా అనేక జిల్లాలలో వైసిపి నేతలు అక్రమ మైనింగ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పారిశుద్య కార్మికులకు ప్రోత్సాహకాలతో పాటు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ ఇవ్వాలని సూచించారు. నిత్యావసరాల ధరలను నియంత్రించాలని చెప్పారు. బ్లాక్ మార్కెట్ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని, దళారులు, అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాలని చెప్పారు. 

రెండు, మూడెకరాల భూమి ఉందనే నెపంతో తెల్లకార్డుదారులకు రూ 1,000 ఆర్ధిక సాయం, రేషన్ సరుకులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం శోచనీయమని అన్నారు.  140లక్షల కార్డుదారులకు రూ. 1000 ఇవ్వాల్సివుండగా 123లక్షల కార్డుదారులకు మాత్రమే ఇచ్చారన్నారు. ఇటీవల తొలగించిన 18లక్షల రేషన్ కార్డుదారులకు కూడా రూ.1,000 ఆర్ధికసాయం, రేషన్ సరుకులు అందజేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఏప్రిల్ 14వ తేదీన  అంబేద్కర్ జయంతిని ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.  అంబేద్కర్ చిత్రపటాలకు ఇళ్లలోనే దండలేసి నివాళులు అర్పించాలని చెప్పారు.

 

Leave a Comment