డెంగ్యూ డేంజర్ బెల్స్.. 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..!

దేశంలో డెంగ్యూ ప్రమాద గంటికలు మోగిస్తోంది. రోజురోజుకు పలు ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.ఢిల్లీ సహా యూపీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో డెంగ్యూతో చిన్నారులు మరణిస్తున్నారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉన్న 9 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపింది. 

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, కేరళ, పంజాబ్, తమిళనాడు, రాజస్తాన్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో డెంగ్యూ ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీలోనే ఈ ఏడాది 1530 డెంగ్యూ కేసులు వచ్చాయి. వీటిలో ఒక్క అక్టోబర్ నెలలోనే 1200 కేసులు వెలుగు చూశాయి. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన నాలుగేళ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 

దీంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ)తో పాటు నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం నిపుణులు డెంగ్యూ తీవ్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజారోగ్యం కోసం చేపడుతున్న చర్యలను పర్యవేక్షించడంతో పాటు వ్యాధి కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకోనున్నారు. ఇదే సమయంలో డెంగ్యూపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ చేయాలని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు వేగంగా జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర బృందాలు సూచించనున్నాయి. ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో డెంగ్యూ వ్యాప్తి అధికంగా ఉన్న 200 జిల్లాలను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం.    

Leave a Comment