టీవీ ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్.. రెచ్చగొట్టే కథనాలు వద్దు..!

కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్(రెగ్యులేషన్) యాక్ట్, 1995లో పేర్కొన్న నిబంధనలకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం చేయవద్దని టీవీ ఛానెళ్లకు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. టీవీ న్యూస్ ఛానెళ్లు టెలికాస్ట్ చేసే కంటెంట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించింది. 

గతవారం ఢిల్లీలోని జహంగీర్ పురిలో జరిగిన హింస, రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో పలు మీడియా ఛానెళ్లు వ్యవహరించిన తీరుపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం హెచ్చరికలు జారీ చేసింది. వివాదాస్పదమైన హెడ్డింగ్ లు, రెచ్చగొట్టేలా హెడ్ లైన్స్, సంచలనాల పేరిట ఇష్టానుసారం కథనాలు ప్రసారం చేయవద్దని హెచ్చరించింది. 

ఢిల్లీలోని జహంగీర్ పురి హింసకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మీడియా ఛానెల్స్ వ్యవహరించిన తీరు.. దర్యాప్తునకు ఇబ్బంది కలిగించిందని కేంద్రం అభిప్రాయపడింది. అసత్య, తప్పుదారి పట్టించే కథనాలు, నీచమైన భాష, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సమాజం అంగీకరించలేని రీతిలో భాషను గుర్తించినట్లు పేర్కొంది. 

జహంగీర్ పురి హింసపై కొన్ని ఛానెళ్లు మత విద్వేషాలను రెచ్చగొట్టే, శాంతికి విఘాతం కలిగించే విధంగా ప్రసారం చేశాయి. అందేవిధంగా ఉక్రెయిన్ పరిణామాలపై న్యూస్ యాంకర్లు అతిశయోక్తితో కూడిన ప్రకనలు ఇవ్వడం, వివాదాస్పదమైన హెడ్డింగ్ లు, ట్యాగ్ లైన్లు తగిలించడం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కంటెంట్ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీని విడుదల చేసింది. 

యాక్ట్ ప్రకారం టీవీ ఛానెళ్లు ఎలా నడుచుకోవాలి?

  • కుల, మతాలను రెచ్చగొట్టేలా ప్రసారాలు చేయకూడదు.
  • ఒకరి పరువు, ప్రతిష్టలను దెబ్బతీసేలా వార్తలు ఉండకూడదు.
  • తప్పుడు సమాచారం, అశ్లీల కథనాల వార్తలు వేయకూడదు.
  • ప్రముఖులపై పుకార్లు ప్రసారం చేయకూడదు.
  • అసత్య వార్తలను నిజం అని నమ్మించే ప్రయత్నం చేయకూడుదు. 
  • సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రెచ్చగొట్టేలా పదేపదే ప్రసారం చేయకూడదు.
  • సగం కథనాలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించకూడదు.
  • ఒకరి మనోభావాలు దెబ్బతీసేలా కథనాలు ఉండకూడదు. 

ఈ నిబంధనలు పాటిస్తున్నాయా?

మరీ ఈ నిబంధనలను మన న్యూస్ ఛానెళ్లు పాటిస్తున్నాయా.. అంటే దాదాపు ఎవరూ పాటించడం లేదనే చెప్పాలి.. ఈ చట్టం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ .. చట్టాన్ని ఉల్లంఘించి వార్తలు ప్రసారం చేసే ఛానెల్స్ మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఒక్కో ఛానెల్ ఒక్కోపార్టీకి అనుకూలంగా వార్తలను ప్రసారం చేస్తోంది.

 ప్రస్తుతం దేశంలో చాలా వరకు న్యూస్ ఛానెళ్లు అన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలను ప్రసారం చేస్తాయి.. కేవలం ఒక వర్గం, లేదా ఒక మతం వారిని టార్గెట్ చేసి మరీ కథనాలను అల్లుతున్నాయి. ఇది నిజమైన జర్నలిజమేనా? అని సామాన్య ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం, జైల్లో వేయడం చేస్తున్నాయి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం అబద్దపు వార్తలను ప్రసారం చేసే న్యూస్ ఛానెళ్ల నోర్లు మూయిస్తుందో లేదో చూడాలి..

Leave a Comment