14 నెలల్లో ఏం చేశారో చెప్పగలరా? : చంద్రబాబు

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు సంధించారు. తమ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, గత 14 నెలల్లో వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏది వాస్తవం..ఏది అవాస్తవం అనేది ప్రజలు గ్రహించాలన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లా అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకెళ్లామని చంద్రబాబు చెప్పారు. 

13 జిల్లాల అభివృద్ధికి తామేం చేశామో చెబుతామన్నారు. గత 14 నెలల్లో ప్రభుత్వం ఏ జిల్లాకు ఏం చేసిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానానికి తీసుకొచ్చామని స్పష్టం చేశారు. జలవనరులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఇప్పటికే పూర్తి కావాల్సిన పోలవరం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో ప్రజలు గమనించాలని కోరారు. 

అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశామనిర, వరుసగా నాలుగేళ్లు రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఆధునీకరించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించామన్నారు. రహదారులు, విద్యుత్ ఇలా అన్ని రంగాల్లో సమస్యలు అనతికాలంలోనే అధిగమించామని వెల్లడదించారు.

రాయలసీమ జీవనాడి లాంటి ముచ్చుమర్రిని పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో లేనిపోని గొడవలు పెట్టి ఇవాళ ఏం సాధించారని ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశామన్నారు. మూతపడ్డ కడప ఎయిర్ పోర్టును ఆధునీకరించామన్నారు. తిరుపతి హార్డ్ వేర్ హబ్ గా తయారు చేశామన్నారు. 

విశాఖను స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ఫిన్ టెక్, మెడ్ టెక్ పార్క్ లకు శ్రీకారం చుట్టామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఏమైందో వైసీపీ నేతలు చెప్పాలన్నారు. విశాఖలో 700 కోట్లతో అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ వేశామన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలకు మూడు పంటలు నీరిచ్చే అవకాశం ఉండేదన్నారు. పట్టి సీమ పూర్తి చేసి క్రిష్ణా డెల్టా నీటి కష్టాలు తీర్చామని చంద్రబాబు వివరించారు.  

 

Leave a Comment