ప్రభుత్వ రంగ సంస్థల ఎదుట  ‘బై బై మోడీ’..!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా శనివారం ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారు.. రెండు రోజుల పాటు నగరంలోనే ఉండనున్నారు. ఈక్రమంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు వెలిశాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఎదుట వినూత్నంగా వేషధారణలో నిరసన తెలిపారు. 

మనీహేస్టే వేషంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపే విధంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బ్యాంకులు, ఎల్ఐసీ, రైల్వే, బిహెచ్ఈఎల్ తదితర కార్యాలయాల ఎదుట ప్లకార్డులతో ‘మేము బ్యాంకులను మాత్రమే దోచుకుంటాం.. మీరు దేశాన్నే దోచేస్తున్నారు.. బై బై మోడీ’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిల్చున్నారు.   

వినూత్న వేషధారణలో ఉన్న వీరు జనాలను ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ లో ఈ బ్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని పలు బ్యాంకులు, పెట్రోల్ బంకులు, కాచీగూడ రైల్వే స్టేషన్, బీహెచ్ఈఎల్, జహీరాబాద్ లోని ఎల్ఐసీ ఆఫీస్ వద్ద వీరు దర్శనమిచ్చారు. 

అచ్చేదిన్..

బ్రిటానియా తయారు చేసే ‘గుడ్ డే’ బిస్కెట్లు మోడీకి చాలా ఇష్టం అంటూ హైదరాబాద్ లో ఓ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. గుడ్ డే ని హిందీలో అచ్చేదిన్ అంటారని, అందుకే ఆ బిస్కెట్లు అంటే మోడీకి బాగా ఇష్టమని అందులో రాసుకొచ్చారు. ఇక్కడ మోడీని నేరుగా విమర్శించలేదు.. కానీ ఎనిమిదేళ్లుగా అచ్చేదిన్ అంటున్న మోడీ ఇప్పటికీ అచ్చేదిన్ తేలేకపోయారనే సెటైర్ మాత్రం బాగా పేలింది. 

 

Leave a Comment