పోలీసులు, ఆర్మీ జవాన్ల మధ్య ఫైట్.. నడిరోడ్డుపై గంటకుపైగా..!

ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లోని డెహ్రడూన్ నేషనల్ హైవేపై పోలీసులు, ఆర్మీ జవాన్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్త పెరిగిపోయి కొట్లాటకు దారితీసింది. నడిరోడ్డుపై దాదాపు గంటకుపైగా ఈ డ్రామా నడిచింది. సరుకులతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ కారును ఢీకొనడంతో ఈ గొడవ జరిగింది.  

పోలీస్ కారును ఆర్మీ ట్రక్ ఢీకొనడంతో.. ఎస్ఐ ఆర్మీ సిబ్బందిని ట్రక్కుతో సహా పోలీస్ స్టేషన్ కి రావాలని చెప్పారు. దీంతో ఈ వివాదం ముదిరింది. జవాన్లు, పోలీసులకు మధ్య తొలుత మాటల యుద్ధం జరిగింది. ఓ సమయంలో తోపులాటకు దారితీసింది. కాసేపటికి అక్కడ జనం గుమిగూడారు. అక్కడ ఉన్న జనం కూడా సైనికులకు మద్దతుగా నిలిచారు. 

ఆర్మీ జిందాబాద్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఇంకొందరు పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి స్థానికులు ఆర్మీ వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పామని, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.  

Leave a Comment