వ్యాక్సిన్ తీసుకోని వారికి షాక్.. వీరికి బ్లాక్ ఫంగస్ ముప్పు..!

కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారికి బ్లాక్ ఫంగస్ ముప్పు ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది మే నుంచి జులై వరకు ఈఎన్టీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, డెంటల్, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, ఇతర వైద్యులు అధ్యయనం నిర్వహించారు. ప్రత్యేక నమూనాలో రోగుల వివరాలు సేకరించి ఆరోగ్య పరీక్షల ఫలితాలను క్రోడీకరించి ప్రాథమిక నివేదికను తయారు చేశారు. 

ఈ అధ్యయనంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని వారిలో బ్లాక్ ఫంగస్ ముప్పు పెరిగినట్లు తేలింది. అలాగే పలువురు బాధితుల్లో డెల్టా వేరియంట్ లక్షనాలు కనిపించాయి. ఒక డోసు కూడా వ్యాక్సిన్ పొందనివారు, రోగనిరోధక శక్తి తగ్గి చక్కెర వ్యాధి కలిగి రక్తంలో ఇనుము శాతం ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ మంది బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. 

ఈనెల 10 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4,609 బ్లాంక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 432 మంది చనిపోయారు. మరణాల రేటు 9.37 శాతంగా నమోదైంది. 2,519 మందికి శస్త్ర చికిత్సలు అయ్యాయి. 3,514 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. విజయవాడ జీజీహెచ్ లో చేరిన బ్లాక్ ఫంగస్ బాధితులపై వైద్య నిపుణుల బృందం అధ్యయనం నిర్వహించింది.

 రాష్ట్రంలో ప్రధాన కోవిడ్ ఆస్పత్రి అయిన విజయవాడ జీజీహెచ్ లో ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు 538 మంది బ్లాక్ ఫంగస్ కు చికిత్స పొందారు. 376 మందికి ఈఎన్టీ, 18 మందికి మెదడు శస్త్ర చికిత్సలు, 76 మందికి దంత శస్త్ర చికిత్సలు చేశారు. 320 యాంఫోటెరిసిన్ ఇంజెక్షన్లను బాధితుల కళ్లకు ఇచ్చారు. రోగుల్లో వంద మంది మరణించారు. 300 మంది నుంచి సేకరించిన వ్యక్తిగత వివరాలు, ఆరోెగ్య పరీక్షల ఫలితాలు, బాధితుల సైనస్ గదుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను వైద్య నిపుణులు పరీక్షించింది. 

పలువురు బాధితుల్లో డెల్టా వేరియంట్ లక్షణాలు కనిపించినట్లు ఈఎన్టీ విభాగాధిపతి ప్రొఫెసర్ పేర్కొన్నారు. బాధితుల శరీరంలో ఉండే క్లోమ గ్రంథిలోని బీటా సెల్స్ ఇన్ ఫెక్షన్ కు గురైనందును ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిందన్నారు. ఫలితంగా రక్తంలో చక్కెర శాతం పెరిగిందన్నారు. ఈ కారణంగా కణజాలంలో ఎసిడోసిస్ వచ్చిందని పేర్కొన్నారు. ఇది ఫంగస్ ఉత్పత్తి పెరిగేందుకు కారణమైందని వెల్లడించారు. 

అంతేకాకుండా కణజాలం వాపునకు గురైనందున రక్తంలో సాధారణ స్థాయికంటే పదింతలు ఇనుము శాతం పెరిగి ఇది ఫంగస్ వృద్ధికి తన వంతు దోహదం చేసిందని ప్రొఫెసర్ వివరించారు. ఇది రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందన్నారు. రోగనిరోధక శక్తి తగ్గినందున ఫంగస్ శరీరంలోకి చొచ్చుకుపోయిందన్నారు. సాధారణంగా కుళ్లిన పదార్థాలు, జంతు కభేబరాలపై పెరిగే ఫంగస్ సూక్ష్మరేణువుల మాదిరి మనుషుల ముక్కుల్లోకి ప్రవేశించిందని, అక్కడి నుంచి సైనస్ కళజాలాలకు వ్యాపించి రక్తనాళాల చుట్టూ ఉన్న గోడలను వాచేలా చేసిందని పేర్కొన్నారు. దీంతో రక్త ప్రసరణ నిలిచి ఆ ప్రదేశం చచ్చుబడిపోయిందని ప్రొఫెసర్ వివరించారు. 

 

Leave a Comment