భీమ్లా నాయక్ గాయకుడికి పవన్ కళ్యాణ్ మర్చిపోలేని బహుమానం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా భీమ్లా నాయక్.. ఈ సినిమా టైటిల్ సాంగ్ పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ తో దుమ్మురేపుతోంది. జానపద గాయకుడు, కిన్నెరమెట్ల వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య పాడిన సాకి మొత్తం పాటకే హైలైట్ గా నిలిచింది. మధ్యలో మరో సింగర్ రామ్ మిరియాల గానం కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇంతకు ఈ మొగులయ్య ఎవరంటే.. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుండా గ్రామానికి చెందిన వాడు. జానపద కథలనే నమ్ముకున్న 12 మెట్ల కిన్నెర కళాకారుడు. గ్రామాల్లో తిరుగుతూ కిన్నెర వాయిస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన కళను గుర్తించిన తెలంగాణ సర్కార్ ఉగాది పురస్కారంతో సత్కరించిది కూడా.. అంతే కాదు.. ఆయన గురించి 8వ తరగతి పాఠ్య పుస్తకంలో పాఠంగానూ చేర్చింది. 

ఈనేపథ్యంలో ఆయన కళ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తన సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చారు. ఈ పాట కోసం మొగులయ్యను చెన్నైకి పంపించి అక్కడ పాటను రికార్డు చేయించారు. భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడడం తనకు సంతోషంగా ఉందని మొగులయ్య చెప్పాడు. ఇప్పటికైనా మొగులయ్యకు సరైన గుర్తింపు లభించిందని చాలా మంది అంటున్నారు. 

 

Leave a Comment