కరోనా సమయంలో 9000 మందికి సాయం అందించారు..!

కరోనా లాక్ డౌన్ సమయలో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు.. కరోనా పాజిటివ్ వచ్చి సొంతవారు కాదనడంతో రోడ్డున పడ్డవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి తనవంతు సాయం అందించి సేవలు చేసింది అక్సా.. ఈమె కథేంటో తెలుసుకుందాం..

పిటాపురానికి చెందిన అమ్మాయి అక్సా.. ఆమె తండ్రి నాటకాల్లో మేకప్ మ్యాన్ గా పనిచేస్తాడు. అక్సా డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు స్వరాజ్య అభ్యుద సేవ సమితి అనే స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్ గా చేరి హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు సహాయం అందిస్తుంది. చదువుకుంటూనే ఖాళీ సమయంలో హెచ్ఐవీ బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చేది.. రోగులకు ఆస్పత్రికి తీసుకెళ్లడం, ఆర్థిక సాయం చేయడం వంటివి చేసేది. 

ఈక్రమంలో అదే సంస్థలో పనిచేసే అమీర్ పాషాను ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. అమీర్ పండ్ల వ్యాపారం చేస్తాడు. వీరిద్దరూ పారా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హెచ్ఐవి ప్రచారం కోసం, బాధితులకు అవగాహన కల్పించడం కోసం అక్సా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. 

కరోనా లాక్ డౌన్ సమయంలో అక్సా సేవలు మరింత విస్తృతమయ్యాయి. కరోనాతో రోడ్డున పడ్డ వారికి ఎంతోకొంత సాయం చేద్దామని అక్సా దంపతులు అనుకున్నారు. మొదటిదశలో హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ భోజనం కోసం ఇబ్బంది పడుతున్న వారికి, యాచకులకు, వలస కూలీలకు ఆహారాన్ని వండి ఇచ్చారు. రెడ్ జోన్ లో ఉన్న వారికి మందులను, అలాగే అవసరమైన సామాగ్రిని కూడా అందజేశారు. ఇలా 9000 మందికి వీరు భోజనం అందించారు. అంతేకాదు దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీరు రాజమండ్రి పరిసర గ్రామాల్లో వారికి నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. వృద్దులను వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం చేశారు. 

ఇక కరోనా రెండో వేవ్ లో ఆరు ఆక్సిజన్ సిలిండర్లను ఆస్పత్రిలో బెడ్లు దొరక్క ఇబ్బంది పడే రోగులకు అందజేశారు. ఇలా అక్సా సేవా కార్యక్రమాలను చూసి ఎంతో మంది బంధువులు ఆర్థిక సాయం అందించారు. ఇంకొంత మంది ఆమెను ఆదర్శంగా తీసుకుని వారు కూడా తమ వంతు సాయం చేశారు. ప్రస్తుతం వారి టీమ్ లో 20 మంది సభ్యులు ఉన్నారు. అమీర్ కూడా కరోనాతో మరణించిన వందల మందికి ఆయన టీమ్ తో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.  

 

Leave a Comment