కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు మంగళవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. వెంటనే ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ భారత్ బంద్ కు దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతో పాటు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు మద్దుతుగా నిలిచాయి. 

తెలంగాణలో..

ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. షాద్ నగర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. నిరసనల్లో భాగంగా నిజామాబాద్ – ముంబై జాతీయ రహదారిని టీఆర్ఎస్ నాయకులు దిగ్భందించారు. ఎమ్మెల్సీ కవిత, ఎంపీ బీబీ పాటిల్ నిరసనల్లో పాల్గొని నల్ల బెలూన్లు ఎగురవేశారు. అనంతరం జాతీయ రహదారి దిగ్భందనంలో కవిత బైటాయించారు. 

ఆంధ్రప్రదేశ్ లో..

భారత్ బంద్ లో భాగంగా లెనిన్ సెంటర్ లో రైతు, కార్మిక, విద్యార్థి, మహిళా సంఘాలు, వామపక్ష నేతల ఆద్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. వ్యవసాయ పనిముట్లతో మహిళా సంఘాల నేతలు నిరసన తెలుపుతున్నారు. బంద్ లో భాగంగా కడప-తాడిపత్రి జాతీయ రహదారి క్రాస్ రోడ్డు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 

ఆస్ట్రేలియాలోని తెలుగు వారి మద్దతు..

నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని తలపెట్టిన భారత్ బంద్ కు మద్దతుగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ తెలంగాణ అసోసియేష్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

రైతులకు మద్దతుా అన్నా హజారే నిరాహార దీక్ష..

రైతులకు మద్దతుగా సామాజిక కార్యకర్త అన్నా హజారే నిరాహార దీక్ష చేపట్టారు. మహారాష్ట్రలోని అహమ్మద్ నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్ధి గ్రామంలో అన్నా హజారే ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న నిరసనను హజారే ప్రశంసించారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

Leave a Comment