‘అసని తుపాను’ ఎఫెక్ట్.. ఏపీలో అక్కడ భారీ వర్షాలు..!

అసని తుపాను ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది రాగల 6 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి ఒడిషా, పశ్చిమ బెంగార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఏపీలో ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  

ఈ నెల 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశమార్చుకుని  ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం చేరే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

Leave a Comment