ఢిల్లో జరిగింది అల్లర్లు కాదు..మరణకాండ : అసదుద్దీన్

ఢిల్లో జరిగినవి మతపరమైన అల్లర్లు కాదని, ముందస్తు ప్రణాళికతో చేసిన మరణకాండ అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆరోపించారు. ఢిల్లీ అల్లర్లలో మరణించిన అమాయక ప్రజల గురించి ప్రధాని మోడీ ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రజలను చంపడానికి రెచ్చగొట్టారని మండిపడ్డారు. వారు స్వయంగా ఈ ప్రకటనలు చేశారా అని ప్రశ్నించారు. ఈ ఘర్షణలకు ప్రభుత్వం సహకరించిందని అసదుద్దీన్ ఆరోపించారు. గాయాలతో కింద పడిపోయిన నలుగురు యువకులపై జాతీయ గీతం పాడాలని ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆ నలుగురిలో ఒకరు చనిపోయాడని చెప్పారు. ఓ మహిళను ఇంట్లోనే సజీవదహనం చేశారని, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి కూడా మరణించాడని గుర్తు చేశారు. 

కాగా, ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో 46 మంది మరణించగా..200 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించి 903 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 254 ఎఫ్ఐఆర్ లను పోలీసులు నమోదు చేశారు.  

Leave a Comment