ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సాధ్యం కాదంటున్న జగన్ సర్కార్..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేస్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను శుక్రవారం విడుదల చేశారు. జనవరి 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

జనవరి 23న తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. ఇక ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

ఎన్నికలు నిర్వహించలేం..

స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహణ చేపట్టలేమని ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యంగా మారుతుందని స్పష్టం చేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే ఎన్నికల నిర్వహణ సాధ్యమన్నారు. ప్రస్తుతం టీకా అందించే ఏర్పాట్లలో అధికారులు తలమునకలై ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని సీఎస్‌ స్పష్టం చేశారు‌. 

కాగా.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలంటూ ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లేందుకు సమాయత్తమైంది. కోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో హౌస్ మోషన్ మూవ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి న్యాయపరమైన పత్రాలను కూడా ప్రభుత్వ లాయర్లు సిద్ధం చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.   

  

Leave a Comment