పోకిరీ చేష్టలకు.. రన్నింగ్ బస్సులో నుంచి దూకిన ఇద్దరు అమ్మాయిలు..!

అమ్మాయిలు కనిపిస్తే చాలు పోకిరీగాళ్లు వేధిస్తుంటారు. వారిని ఈవ్ టీజింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీరి ఆగడాలు ఆగడం లేదు.. తాజాగా యువకుల పోకిరీ చేష్టలకు ఇద్దరు కాలేజీ అమ్మాయిలు రన్నింగ్ బస్సులో నుంచి కిందకు దూకేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బులందర్ షహర్ లో గురువారం చోటుచేసుకుంది.

 వివరాల మేరకు రన్ హెరా గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు సొంత గ్రమానికి వెళ్లేందుకు గురువారం 10 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కారు. ఆ యువతులు కూర్చున్న సీట్లకు ముందు సీట్లలో యువకులు కూర్చొని ఉన్నారు. తమ ఊరు దగ్గరపడుతున్న సమయంలో వారు డ్రైవర్ దగ్గరకు వెళ్లి బస్సు ఆపాల్సిందిగా కోరారు. అయితే డ్రైవర్ అందుకు ఒప్పుకోలేదు. బస్సు ఆ ఊరు మీద నుంచి వెళ్లదని చెప్పాడు. 

ఇక బస్సు ముందు సీట్లలో కూర్చుని ఉన్న యువకులు ‘ఈ రోజు బస్సు మీ ఊర్లో ఆగదు.. ఇక చూడు.. భలే సరదా ఉంటుంది’ అని చెప్పారు. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు భయాందోళనకు గురయ్యారు. బస్సు డ్రైవర్ ను మరోసారి కోరారు. దానిని అతడు ఒప్పుకోలేదు. ఆ యువకులు కేకలు వేశారు.

 దీంతో భయాందోళనకు గురైన ఇద్దరు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు బస్సులో నుంచి దూకేశారు. ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ యువతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే డ్రైవర్ ఆ కుటుంబాలతో రాజీపడటంతో గొడవ సద్దుమణిగింది. ఆ ఆకతాయిల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.  

Leave a Comment