రంగు మార్చండి..

ఏపీ హైకోర్టు కీలక తీర్పు

అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గ్రామసచివాలయాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశించింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం ఇవాళ్టి నుంచి పది రోజుల్లో మళ్లీ రంగులు వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలను నివేదిక రూపంలో సమర్పించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈసీ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలని సూచించింది. వైసీపీ జెండా రంగు తరహాలో రంగులు వేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ జారీ చేసిన మెమోను హైకోర్టు రద్దు చేసింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో  తీవ్ర చర్చానీయాంశమైంది. గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, వాటర్‌ ట్యాంకులకు వైకాపా జెండాను పోలిన రంగులు వేయడంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

 

Leave a Comment