అవినీతిని ఏరిపారేయాలి : సీఎం జగన్

అమరావతి : వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలని, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అవినీతి ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అవినీతి వల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు.

మందుల కొనుగోలులో పారదర్శకత ఉండాలన్నారు. కొనుగోలు చేసిన మందుల్లో జీఎంపీ ప్రమాణాలు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈఎస్ఐ బిల్లులు కూడా ఎప్పటికప్పుడు విడుదల చేయాలన్నారు. వైద్య సేవల్లో నాణ్యత కోసం ఇప్పటికే కొన్ని ప్రమాణాలు నిర్దేశించుకున్నామని, అవి ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలని సూచించారు. 

పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక టీచింగ్ ఆస్సత్రి..

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక టీచింగ్ ఆస్పత్రిని పెడుతున్నామన్నారు. అలాగే నర్సింగ్ కాలేజీలు పెడుతున్నామని పేర్కొన్నారు. ఇప్పుడున్న టీచింగ్ ఆస్పత్రుల సంఖ్య 11 నుంచి 27కి పెంచుతున్నామన్నారు. ఈ ఆస్పత్రుల నుంచి వచ్చే వైద్యుల సేవలను ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సేవల మెరుగు కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. 

కాలుష్య నివారణపై చర్యలు..

కాలుష్య నివారణపై గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని కాలుష్యం బారి నుంచి కాపాడాలన్నారు. సముద్రంలో వదిలేస్తున్న వ్యర్థాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం అని, భావితరాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. కాలుష్య నివారణ ప్రమాణాలు డిస్ ప్లే చేయాలన్నారు. కాలుష్యం వల్ల అందులో పని చేసే కార్మికుల ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తాయన్నారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలన్నారు. 

ఎల్ఐసీ నుంచి బీమా చెల్లింపు నిలిచిపోయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదన్నారు. దీనిపై స్పందించిన సీఎం కార్మికులు బీమా రూపంలో ఎల్ఐసీ పడ్డ బకాయిల చెల్లింపు కోసం ప్రధానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. 

 

Leave a Comment