అమూల్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం ..!

అమూల్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎం జగన్ సమక్షంలో ఒప్పందం (ఎంఓయూ)పై అమూల్ చెన్నై జోనల్ హెచ్ రాజన్, ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీ పాడి పారిశ్రామిక రంగంలో ఇది మైలు రాయి అన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు రైతులకు మంచి ధరలు, వినియోగదారులకు సరసమైన ధరలకు పాల ఉత్పత్తులు అందుబాటులో ఉండాలని లక్ష్యంగా అని తెలిపారు.  పాడి పశువుల పెంపకం, డెయిరీల నిర్వహణలో పరిజ్ఞానం, సహకార సంఘాల అంశాల్లో మహిళలకు అపార అవకాశాలు ఉంటాయన్నారు. 

ఏపీకి, అమూల్‌కు ఈ ఒప్పందం ఒక చరిత్రాత్మక అడుగని, మహిళల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పాల ఉత్పత్తిలో దేశంలోనే 4వ స్థానంలో ఉన్నామన్నారు. కాని కేవలం 24 శాతం పాలు మాత్రమే వ్యవస్థీకృత రంగానికి వెళ్తున్నాయని తెలిపారు. దీంతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

లీటరు పాలు, లీటరు మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ధర ఒకేలా ఉందంటూ పాదయాత్రలో నాకు రైతులు చూపించారన్నారు. గత ప్రభుత్వం తమ సొంత కంపెనీ హెరిటేజ్‌ కోసం ప్రభుత్వ సహకార డెయిరీలను నిర్వీర్యం చేసిందన్నారు. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ కింద ఉన్న డెయిరీలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, అమూల్‌తో భాగస్వామ్యం ద్వారా ఈ రంగంలో మంచి మార్పులను ఆశిస్తున్నామని చెప్పారు. 

దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ గేట్‌వే..

దక్షిణాది రాష్ట్రాలకు ఏపీ గేట్‌వే లాంటిదన్నారు. బెంగుళూరు అనంతపురంకు సమీపంలో, చెన్నై చిత్తూరుకు, హైదరాబాద్‌ కూడా ఏపీ సరిహద్దుకు సమీపంలో, విశాఖపట్నం కూడా ఒడిశాకు సమీపంలో ఉందని, మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్‌ ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మార్కెటింగ్‌ హబ్‌గా కూడా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. 

 

Leave a Comment