మంచు చరియలు విరిగిపడి.. చిత్తూరు జిల్లా జవాన్ మృతి..!

మంచు చరియలు విరిగిపడి చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ మృతి చెందాడు. రోడ్డుపై అడ్డంగా పడిన మంచును తొలగిస్తుండగా ఈ దారుణం జరిగింది. దీంతో జిల్లాలోని మూకలకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లె గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నారాయణరెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు కార్తిక్ కుమార్ రెడ్డి 2011లో ఆర్మీలో చేరాడు. 

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉదయ్ పుర్ – టిండి సెక్టార్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. దీపావళి రోజు గురువారం మంచు చరియలు రోడ్డుకు అడ్డంగా పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సహచర జవానులతో కలిసి కార్తిక్ మంచును తొలగిస్తున్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా మంచు గడ్డలు జవానుల మీద పడ్డాయి. 

ఈ ప్రమాదంలో కార్తిక్ కుమార్ రెడ్డి(29) మరణించాడు. సుమారు 8 గంటల పాటు సహచర జవానులు మంచు గడ్డలను తొలగించి కార్తీక్ మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్గం నిమిత్తం కీలాంగ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కార్తీక్ మరణ వార్తను ఆర్మీ అధికారులు శుక్రవారం జవాన్ అన్న క్రాంతి కుమార్ రెడ్డికి ఫోన్ లో చెప్పారు. కొడుకు మరణవార్త విన్న తల్లి సరోజమ్మ కన్నీరుమున్నీరవుతుంది. కార్తీక్ కుమార్ రెడ్డి ఈ ఏడాది మేలో అన్నయ్య క్రాంతి కుమార్ రెడ్డి పెళ్లికి వచ్చి వెళ్లాడు. నాలుగు నెలల కిందటే ముంబై నుంచి హిమాచల్ ప్రదేశ్ కి బదిలీ అయ్యాడు..   

Leave a Comment