చింతామణి నాటకంలో ఏముంది?.. ఏపీ ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?

తెలుగు రాష్ట్రాల్లో చింతామణి నాటకం గురించి తెలియని వారుండరేమో.. ఇది ఒక సాంఘిక నాటకం. మహాకవి కాళ్లకూరి నారాయణరావు అప్పటి సామాజిక సమస్యల ఆధారంగా రచించారు. ఈ నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది వేశ్యవృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం ఇది.. లీలాశుకచరిత్ర ఆధారంగా ఈ నాటకం రచించబడింది. 

తాజాగా చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని, సమాజాన్ని సంస్కరించే దిశగా కాకుండా వ్యసనాల వైపు మళ్లీంచేలా ఉందని, దీనిని నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ నాటకం తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

20వ దశాబ్దంలోని మూడో దశకంలో సామాజిక సమస్యల ఆధారంగా చింతామణి నాటకాన్ని రచించారు. అప్పట్లో పురుషులు వేశ్యల మోజులో కుటుంబాలను నాశనం చేసుకుంటుండటంతో అవగాహన కల్పించేలా ఈ నాటకం ప్రదర్శించారు. ఈ నాటకంలో ప్రధాన పాత్రలు చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, భవానీ శంకరం, శ్రీహరి, చిత్ర. ఇందులో చింతామణిది వేశ్య పాత్ర కాగా.. సుబ్బి శెట్టిది స్త్రీమోజులో డబ్బంతా పోగొట్టుకునే పాత్ర.. 

నాటకం కథ ఏంటంటే.. 

చింతామణి ఒక వేశ్య. ఆమె తల్లి శ్రీ హరి, చెల్లి చిత్ర. భవాని శంకరుడనే నియోగ బ్రాహ్మణుడు, సుబ్బిశెట్టి అనే వ్యాపారి ఆమె విటులు. ఆమె వారి ఆస్తి నంతా అపహరిస్తుంది. భవాని శంకరం ద్వారా అతని స్నేహితుడు బిల్వమంగళుని ఆకర్షిస్తుంది. బిల్వమంగళుడు, ఆమె వలలో పడి భార్యను, వార్ధక్యంతో అనారోగ్యం పాలైన తండ్రిని కూడా నిర్లక్ష్యం చేస్తాడు. ఒక రోజు బాగా వర్షం పడుతున్న వేళ బిల్వమంగళుడు అర్ధరాత్రి నీటిలో తేలివచ్చిన ఒక దుంగ ఆధారంతో వాగు దాటి చింతామణి గృహం చేరుకొని తలుపులు వేసి ఉంటే గోడమీద వ్రేలాడుతున్న తాడు సాయంతో ఇంట్లో ప్రవేశిస్తాడు. దీపం తెచ్చి చూస్తే అది తాడు కాదు పాము. అదే విధంగా వాగు దాటడానికి సహకరిచింది దుంగ కాదు బిల్వమంగళుని భార్య రాధ శవం. భర్త వాగు దాటడానికి పడవని పిలిచే ప్రయత్నంలో వాగులో పడి మరణిస్తుంది రాధ. బిల్వమంగళునికి తనపై ఉన్న వ్యామోహానికి విస్తుపోతుంది. బిల్వమంగళునిలో పరివర్తన వస్తుంది. ఆ రాత్రి చింతామణికి శ్రీకృష్ణుడు కనబడతాడు. దానితో ఆమెలో వైరాగ్యం కలిగి సన్యసిస్తుంది. బిల్వమంగళుడు కూడా సోమదేవ మహర్షి పిలుపువల్ల ప్రభావితుడై ఆశ్రమ స్వీకారం చేసి అనంతర కాలంలో లీలాశుక యోగీంద్రుడుగా మారి శ్రీ కృష్ణ కర్ణామృతం అనే సంస్కృత గ్రంథాన్ని రాస్తాడు. 

నిషేధం ఎందుకంటే?

ఈ నాటకాన్ని మొదటిసారిగా బందరులోని రామమోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. 1923 నాల్గవ కూర్పు నాటికే సుమారు 446 సార్లు ఈ నాటకం ఆంధ్రరాష్ట్రమంతా ప్రదర్శించబడింది. గత రెండు, మూడు దశాబ్దాల వరకు చింతామణి నాటకానికి చాలా క్రేజ్ ఉండేది. అయితే కాలక్రమేణా నాటకంలోని సంభాషణలు, పద్యాల్లో మార్పులు వచ్చాయి. హస్యంలో అశ్లీల డైలాగులు చేర్చారు. ప్రజల్లో ఆదరణ కోసం ఒరిజనల్ కంటెంట్ ని మార్చేశారు. కేవలం చింతామణి, సుబ్బిశెట్టి మధ్య డబుల్ మీనింగ్ డైలాగులకు ప్రాధాన్యత పెరిగింది. దీంతో వైశ్య సంఘం నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ నాటకాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.   

 

Leave a Comment