దేశ ప్రజలందరిదీ ఒకే డీఎన్ఏ : మోహన్ భగవత్

భారతీయులందరిదీ ఒకే డీఎన్ఏ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. హిందూ, ముస్లిం అనేవి రెండు వేర్వేరు సమూహాలు కావని, ఆ రెండూ ఇప్పటికీ కలిసి ఉన్నాయని అన్నారు. ముస్లింలను దేశంలో ఉండొద్దనే వాళ్లెవరైనా సరే వారు హిందువులే కాదన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఆదివారం జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం) ఏర్పాటు చేసిన ‘హిందుస్తానీ ఫస్ట్.. హిందుస్తాన్ ఫస్ట్’ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూక దాడులు చేసే వారిని హిందుత్వానికి శత్రువులుగా అభివర్ణించారు. దేశంలో నివశిస్తున్న వారందరిదీ ఒకే డీఎన్ఏ అని, వారు ఏ ధర్మాన్ని ఆచరించే వారైనా పర్లేదని అన్నారు. పూజా విధానం వేరైనంత మాత్రాన వారిని వేరుగా చూడటం సమంజసం కాదన్నారు. 

కొన్ని విషయాలను రాజకీయ కోణంలో చూడలేమని, రాజకీయాలు ప్రజలను ఏకం చేయలేవని భగవత్ అన్నారు. ఐక్యతను నాశనం చేసే ఆయుధంగా రాజకీయం మారుతుందన్నారు. దేశంలో ఐక్యత లేకుండా అభివృద్ధి అసాధ్యం అన్నారు. ఐక్యతకు ఆధారం జాతీయవాదం అని వివరించారు. 

మనమంతా ప్రజాస్వామ్య వ్యవస్థలో నివశిస్తున్నామని, అందుకే హిందువుల ప్రభుత్వమో, ముస్లింల ప్రభుత్వమో ఉండే అవకాశం లేదన్నారు. కేవలం భారీతీయుల ప్రభుత్వం మాత్రమే ఉంటుందన్నారు. సంఘ్ మైనారిటీలకు వ్యతిరేకం కాదని, దేశంలో ఇస్లాం ప్రమాదంలో ఉందనే అభద్రత అక్కర్లేదని చెప్పారు. గో సంరక్షణ పేరిట హింసను క్షమించలేమని చెప్పారు. 

Leave a Comment