వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలకు శ్రీకారం

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరులో సమూల మార్పులు చేస్తూ బాలలు, గర్భిణీలు, బాలింతలకు అత్యంత మెరుగైన పౌష్టికాహారం అందించే వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, వైయస్సార్‌ సంపూర్ణ పోషన్‌ ప్లస్‌ పథకాలను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షల అక్క చెల్లెమ్మలు (గర్భిణీలు, బాలింతలు), చిన్న పిల్లలకు ఏటా రూ.1863.11 కోట్ల వ్యయంతో ఈ పథకాలు అమలు చేస్తున్నారు. గిరిజనేతర, మైదాన ప్రాంతాల్లో వైయస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తుండగా, గిరిజన ప్రాంతాల్లోని 77 మండలాల్లోని వారి కోసం వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం అమలు చేస్తున్నారు. రెండు పథకాలను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, పౌష్టికాహార కిట్లను లబ్ధిదారులకు (బాలలకు) అందజేశారు. ఇంకా వైయస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్, ప్యాకెట్‌ బుక్‌తో పాటు, ఎస్‌ఓపీ బుక్‌లెట్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మన పిల్లలు రేపటి పౌరులు అని, మరి రేపటి ప్రపంచంతో వారు పోటీ పడే స్థితిలో ఉన్నారా? లేరా? లేక వారిని ముందు తరాల మాదిరిగానే పేదరికంలో మగ్గిపోయేలా వదిలి పెట్టాలా? అన్న ప్రశ్నల నుంచి మార్పు దిశలో అన్నీ ఆలోచించి వారిలో మార్పు కోసం అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. హెల్తీ బాడీ అండ్‌ హెల్తీ మైండ్‌ ఈ రెండూ కూడా ఇంటర్‌ రిలేటెడ్‌ అని, హెల్తీ బాడీ ఉంటే హెల్తీ మైండ్‌ ఉంటుందని తెలిపారు. నేటి తరంలో చాలా మందికి మంచి ఆహారం లభించని పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారన్నారు. వారందరిలో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందని గట్టిగా నమ్మిన తర్వాతనే వైయస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాలు తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు.‘6 నెలల నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న పిల్లల వరకు, బిడ్డకు జన్మనివ్వనున్న తల్లులు, బాలింతలకు వర్తించేలా ఈ వైయస్సార్‌ పోషణ పథకాలు అమలు చేస్తున్నాం’ అని సీఎం  వైయస్‌ జగన్‌ వివరించారు. 

రాష్ట్రంలోని గర్భవత్లులో దాదాపు 53  శాతం మందిలో రక్తహీనత ఉందని, 31.9 శాతం పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం లేదా 5 ఏళ్ల వరకు ఆ పరిస్థితిలోనే కొనసాగడం, ఇంకా 5 ఏళ్లలోపు పిల్లల్లో 17.2 శాతం మంది బరువుకు తగ్గట్లు ఎత్తు పెరగని వారున్నారని, మరోవైపు వయసుకు తగ్గట్లు ఎత్తు పెరగని వారు దాదాపు 32 శాతం మంది ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు.ఇవన్నీ కొత్తగా వచ్చినవి కావని, కేవలం గతంలోని పాలకుల నిర్లక్ష్యమే అందుకు కారణమని చెప్పారు. అందుకే ఈ పరిస్థితి మారాలని, ఈ నెంబర్లు మారాలని, పిల్లలు, వారి తల్లులకు మంచి జరగాలని ఆయన అన్నారు.

 

Leave a Comment