స్వీపర్ గానే పనిచేస్తా.. ‘ఆప్’ ఎమ్మెల్యే తల్లి..!

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీపై ఆప్ అభ్యర్థి లభ్ సింగ్ విజయం సాధించారు. లభ్ సింగ్ సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. 12వ తరగతి వరకు చదువుకుని మొబైల్ రిపేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతడి తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ స్వీపర్ గా పనిచేస్తున్నారు. 

కొడుకు ఎమ్మెల్యే అయితే ఎవరైనా స్వీపర్ పని చేయడానికి ఇష్టపడరు. కానీ లభ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ మాత్రం స్వీపర్ ఉద్యోగం వదులుకోవడానికి నిరాకరించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతి రోజు ఆమె డ్యూటీకి వెళ్లడం అందరినీ ఆశ్యర్య పరిచింది. తన కొడుకు గెలిచిన తర్వాత తాను స్వీపర్ పనికి రానని అందరూ అనుకున్నారని, కానీ తన కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు కానీ తాను కాదు కదా అని, తాను ఉద్యోగాన్ని ఎందుకు వదులుకోవాలని కౌర్ ప్రశ్నించారు. 

బల్దేవ్ కౌర్ గత 22 సంవత్సరాలుగా బర్నాలా జిల్లాలోని ఉగోకే గ్రామ పాఠశాలో స్వీపర్ గా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చున్నీపై లభ్ సింగ్ 37 వేలపై చిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు. చీపురు గుర్తుపై తన కొడుకు గెలుపొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈ చీపురు తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని, తన ఉద్యోగాన్ని కొనసాగిస్తానని కౌర్ స్పష్టం చేశారు. చరణ్ జీత్ సింగ్ పై తన కొడుకు విజయం సాధిస్తాడని నమ్మకం ఉండేదని అన్నారు. 

Leave a Comment