మనిషి మెదడులో చిప్.. ప్రయోగం సక్సెస్..!

తొలిసారిగా ఓ మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చారు. ‘న్యూరాలింక్’(Neuralink) సంస్థ చేసిన ఈ ప్రయోగం విజయవంతమైనట్లు సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్(Elon Musk) వెల్లడించారు. చిప్ అమర్చిన వ్యక్తి ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు.   ప్రారంభ ఫలితాల్లోనే స్పష్టమైన ‘న్యూరాన్ స్పైస్ డిటెక్షన్’ను (Neuron Spice Detection) గుర్తించినట్లు మస్క్ పేర్కొన్నారు.

మానవ మెదడుకు, కంప్యూటర్ కు మధ్య నేరుగా సంబంధాలు మెరుగుపరిచే లక్ష్యంతో టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ సారధ్యంలోని స్టార్టప్ కంపెనీ ‘న్యూరాలింక్’ సంస్థ 2016లో ఏర్పాటైంది. మానవ శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడం సహా.. పార్కిన్సన్ వంటి వ్యాధులను నివారించడమే దీని లక్ష్యమని ఎలన్ మస్క్ తెలిపారు. మనిషికి, ఏఐకు మధ్య సాంకేతిక సంబంధం బలపరిచేలా ఈ చిప్ ఉపకరిస్తుందని మస్క్ వెల్లడించారు. ‘మనిషి మెదడులో చిప్ అమర్చాం. ఆ వ్యక్తి క్రమంగా కోలుకుంటున్నాడు.’ అని మస్క్ ‘X’ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

ఇది ఎలా పని చేస్తుంది? 

న్యూరాలింక్ బ్రెయిన్ – కంప్యూటర్ ఇంటర్ ఫేస్ (BCI)లో భాగంగా 8 మిల్లీ మీటర్ల వ్యాసం కలిగిన ‘ఎన్ 1’ (N1) అనే చిప్ ఉంటుంది. దీనికి సన్నటి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. వీటిని వెంట్రుకతో పోలిస్తే మందం 20వ వంతు మాత్రమే ఉంటుంది. పుర్రెలో చిన్న భాగాన్ని తొలిగించి అక్కడ ‘ఎన్ 1’ చిప్ అమరుస్తారు. దీనికి ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఓ చిప్ లో 3 వేలకు పైగా ఎలక్ట్రోడ్స్ ఉండగా.. వాటిని మెదడులోని ముఖ్య భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. దీని వల్ల లోపల కణజాలాలకు ఎలాంటి నష్టం జరగదు. ఈ ఎలక్ట్రోడ్స్ మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమయ్యే సందేశాలను గుర్తించి చిప్ నకు పంపుతాయి. ఓ చిప్ లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తంగా ఓ వ్యక్తిలోకి 10 చిప్ లను ప్రవేశపెట్టొచ్చు. చిప్ మెదడులో ఇన్ స్టాల్ అయ్యాక ఈ బీసీఐ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, తదనుగుణంగా ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించే అల్గారిథమ్స్ గా మారుస్తుంది. కాగా, చిప్ లోని బ్యాటరీ వైర్ లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది. అందువల్ల దీన్ని ధరించిన వారు సాధారణంగానే కనిపిస్తారు. ఒకవేళ, ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదని, అందువల్లే పుర్రెలో అమర్చాల్చి వస్తోందని సంస్థ తెలిపింది.

ప్రయోజనాలు ఇవే..

మానవ మెదడులో ‘చిప్’ అమర్చే ఇలాంటి ప్రయోగాల ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని ‘న్యూరాలింక్’ సంస్థ చెబుతోంది. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్ ను నేరుగా ఆపరేట్ చెయ్యొచ్చని తాకాల్సిన అవసరం లేదని పేర్కొంది.

  • నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను మెరుగుపరిచే వీలుందని తెలిపింది. వీరు సులువుగా గ్యాడ్జెట్స్ ఉపయోగించగలుగుతారని, దీర్ఘకాలంలో వీరి అవయవాలను పునరుద్ధరించే అవకాశం ఉందని వెల్లడించింది.
  • డిమెన్షియా, పార్కిన్ సన్స్, అల్జీమర్స్ మానసిక సమస్యల చికిత్స కోసం దీన్ని వాడొచ్చు. అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్ లోడ్ చేసుకుని.. కంటి చూపు, వినికిడి పరిధిని పెంచుకోవచ్చు.
  • ఈ చిప్ సాయంతో హార్మోన్ స్థాయిని నియంత్రించొచ్చని, కుంగుబాటును దూరం చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్ లేదా స్వర సందేశాలతో కమ్యూనికేషన్ పెంపొందించుకోవచ్చని, బొమ్మలు సులువుగా గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని వివరించింది.

 

Leave a Comment