4 ఏళ్లు మంచం మీదే.. కరోనా వ్యాక్సిన్ ఇవ్వగానే లేచి కూర్చున్న వ్యక్తి..!

పక్షవాతంతో ఓ వ్యక్తి నాలుగేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ సభ్యులు వైద్యులకు చూపించి చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. కానీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వగానే అనారోగ్యంతో మంచంపట్టిన వ్యక్తి లేచి కూర్చున్నాడు. ఈ ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు బొకారో జిల్లాలోని పెటార్వార్ గ్రామానికి చెందిన దులార్ చంద్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు వైద్యులకు చూపించినా ఫలితం లేకుండా పోయింది. నడవలేక, మాట్లాడలేక నాలుగేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు కూడా ఇక దులార్ చంద్ కి నయం కాదని మంచం మీదనే ఉంచి చూసుకుంటున్నారు. 

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జనవరి 4 ఓ ఆరోగ్య కార్యకర్త దులార్ చంద్ కి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు. విచిత్రం ఏంటంటే వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే అతడి శరీరం స్పందించింది. వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే దులార్ చంద్ర లేచి కూర్చున్నాడు. పక్షవాతం వల్ల మాటలుకూడా సరిగ్గా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు వ్యాక్సిన్ ఇచ్చిన వారు సైతం షాక్ అయ్యారు. వ్యాక్సిన్ లో అంత మహత్యం ఏముందో ఎవరికీ తెలియడంలేదు.  

Leave a Comment