తండ్రి మైనపు విగ్రహం సమక్షంలో.. పెళ్లి చేసుకున్న యువకుడు..!

ఆ యువకుడికి తండ్రి అంటే ఎంతో ఇష్టం.. అయితే తన పెళ్లి చూసేందుకు తన తండ్రి ఈ లోకంలో లేడు.. తండ్రి లేకున్నా.. తన పెళ్లి వేడుకలో ఆ లోటు కనిపించకూడదని అనుకున్నాడు ఆ యువకుడు.. అందుకే తండ్రి మైనపు విగ్రహాన్ని తయారు చేయించాడు.. ఆ విగ్రహం ఎదురుగానే తాను ఇష్టపడిన యువతిని పెళ్లి చేసుకున్నాడు… ఈ అపురూపమైన వివాహం కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడులో జరిగింది.. 

చిక్కమగళూరు జిల్లా కడూరు తాలుకా అజ్జంపుర గ్రామానికి చెందిన యతీష్ తండ్రి రమేష్ కరోనా సెకండ్ వేవ్ లో మరణించారు. యతీష్ మైసూరులో ఆయుర్వేద వైద్య కళాశాలలో ఎండీ కోర్సు చేస్తున్నాడు. యతీష్ కి నంజనగూడుకు చెందిన డాక్టర్ అపూర్వతో పెళ్లి నిశ్చయం అయ్యింది. అయితే పెళ్లి మాత్రం తన తండ్రి సమక్షంలోనే చేసుకోవాలని భావించాడు యతీష్..

అందుకోసం బెంగళూరులో తన తండ్రి మైనపు విగ్రహాన్ని తయారు చేయించాడు. శనివారం విగ్రహాన్ని కల్యాణమండపానికి తీసుకొచ్చి ఆయన ఎదురే అపూర్వ మెడలో తాళి కట్టాడు. అనంతరం తండ్రి మైనపు విగ్రహం పక్కనే ఆసనం వేసి అందులో తల్లిని కూర్చోబెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు. తన తండ్రే కల్యాణ మండపంలో కూర్చున్న అనుభూతి కలిగిందని యతీష్ తెలిపాడు.  

 

 

Leave a Comment