50 రూపాయలకు ఆశపడి.. రూ.లక్ష పోగొట్టుకున్నాడు..!

ఓ వ్యక్తి 50 రూపాయలకు ఆశపడి.. లక్ష రూపాయలను పోగొట్టుకున్నాడు.. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు – చెన్నై జాతీయ రహదారిపై జరిగింది. వివరాల మేరకు చెన్నై, ఆవడి సమీపంలోని అంబికాపురంకు చెందిన త్యాగరాజన్ ఓ భవన నిర్మాణ కాంట్రాక్టర్.. అతడు బ్యాంకులో నగలను తాకట్టు పెట్టాడు. 

ఆ నగలను విడిపించడానికి శుక్రవారం మధ్యాహ్నం రూ.లక్ష తీసుకొని ఇంటి నుంచి తిరునిండ్రవూర్ లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు బయలుదేరాడు. ఈక్రమంలో అతడిని నలుగురు వ్యక్తులు వెంబడించారు. తిరువళ్లూరు-చెన్నై జాతీయ రహదారిపై వారు త్యాగరాజన్ తో ‘మీ జేబులో నుంచి రూ.50 నోటు కింద పడిందని చెప్పారు..

దీంతో త్యాగరాజన్ తన బైక్ ని రోడ్డు పక్కన ఆపి 50 రూపాయలు తీసుకుని వచ్చాడు. అంతలో బైక్ లో పెట్టిన లక్ష రూపాయలు కనిపించలేదు. దీంతో త్యాగరాజన్ తిరునిండ్రవూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో ఆ నలుగురు వ్యక్తులు త్యాగరాజన్ దృష్టి మళ్లించి నగదు తీసుకొని పారిపోయినట్లు తెలిసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Leave a Comment