షాహీన్ బాగ్ లో బుల్డోజర్లు.. తీవ్ర ఉద్రిక్తత..!

ఢిల్లీలోని షాహీన్ బాగ్.. ఈ పేరు దాదాపు అందరూ వినే ఉంటారు.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలకు కేంద్రంగా ఉన్న ప్రాంతం.. సోమవారం మరోసారి వార్తల్లో నిలిచింది.. షాహీన్ బాగ్ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. 

అందులో భాగంగా సోమవారం షాహీన్ బాగ్ కి బుల్డోజర్లను తీసుకొచ్చారు. అయితే కూల్చివేతలను అడ్డుకుంటూ భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో పారామిలిటరీ సిబ్బందిని రంగంలోకి దించారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికగా నిలిపివేశారు. బుల్డోజర్లను అక్కడి నుంచి పంపారు.

ఈ నిరసనల్లో స్థానికులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మద్దతుదారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలను ఇప్పటికే తొలగించామని, అయినా బీజేపీ ఉద్దేశ పూర్వకంగా రాజకీయాలు చేస్తోందని తెలిపారు. 

ఈ కూల్చివేతను అడ్డుకోవాలని సీపీఎం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది. రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, సంఘ విద్రోహశక్తులు ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఢిల్లీ బీజేపీ నేత ఆదేశ్ గుప్తా ఇటీవల నగర మేయర్ ని కోరారు. ఈక్రమంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు పది రోజుల కార్యాచరణను ఎస్డీఎంసీ సిద్ధం చేసింది. తుగ్లకాబాద్, సంగమ్ విహార్, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, షహీన్ బాగ్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరగనున్నట్లు ఎస్డీఎంసీ చైర్మన్ రాజ్ పాల్ తెలిపారు. 

Leave a Comment