ఇచ్చిన హామీలను 90 శాతం నెరవేర్చాం : సీఎం జగన్

ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖపై మేధో మధన సదస్సు నిర్వహించారు. ‘మన పాలన-మీ సూచన’ పేరుతో అధికారులతో సమావేశమయ్యారు. ఈ ఏడాదిలో ఆరోగ్య శాఖలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను 90 శాతం నెరవేర్చామని చెప్పారు.

ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి వర్తింపజేశామన్నారు. 1.42 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. 2 వేల జబ్బులను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెస్తూ జులై 8 నుంచి మరో 6 జిల్లాలో అమలు చేస్తామన్నారు. నవంబర్ 8 నుంచి మిగిలిన జిల్లాల్లో కూడా అమలు చేస్తామన్నారు. క్యాన్సర్, స్పీచ్ థెరపీని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామన్నారు. 

ఆస్పత్రుల రూపురేఖలు మార్చేలా ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని చేపట్టామని జగన్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరిస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 24 గంటలు వైద్య సహాయం అందుబాటులో ఉండేలా విలేజ్ క్లినిక్ లు ఉంటాయన్నారు. జులై 1 నుంచి 1060 కొత్త 104, 108 అంబులెన్స్ లను ప్రారంభిస్తామన్నారు. 

Leave a Comment