మూఢనమ్మకంతో చిన్నారిని బలిచ్చిన తల్లి..!

మూఢనమ్మకాలతో ఓ తల్లి తన ఆరు నెలల బిడ్డ ప్రాణం తీసింది. నాగదేవతల రూపంలో ఉన్న చిత్రపటాల ఎదుట కత్తితో గొంతు కోసి బలిచ్చింది. నాగదోషం పోతుందనే మూఢ విశ్వాసంతో చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చింది. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటితండాలో గురువారం చోటుచేసుకుంది.

వివరాల మేరకు మేకలపాటి తండాకు చెందిన బానోతు కృష్ణకు అదే తండాకు చెందిన భారతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. దివ్యాంగుడైన కృష్ణ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఆరు నెలల చిన్నారి ఉంది. అయితే కృష్ణ, భారతిల వివాహమై 7 నెలల తర్వాత ఊర్లోకి జోస్యం చెప్పేవాడు వచ్చాడు. అతడి వద్ద భారతి జోస్యం చెప్పించుకుంది. 

దీంతో అతడు భారతికి నాగదోషం ఉందని చెప్పాడు. అది తొలగాలంటే నాగపూజలు చేయాలని, అంతే కాదు ఆమెకు జన్మించే బిడ్డను బలివ్వాలని చెప్పినట్లు సమాచారం..అప్పటి నుంచి భారత నాగపూజలు చేస్తుంది.  ఈక్రమంలో ఆరు నెలల క్రితం ఆడ బిడ్డ రీతు పుట్టింది. తర్వాత రెండు మూడు సార్లు చిన్నారిని బలిచ్చేందుకు ప్రయత్నించింది. 

అయితే గురువారం సాయంత్రం భర్త సూర్యాపేటకు వెళ్లగా.. చిన్నారిని ఇంట్లో గొంతు కోసి చంపేసింది. చిన్నారిని బలిచ్చాకా ‘ నా బిడ్డను చంపేశా.. నాకిక ఎలాంటి నాగ దోషం లేదంటూ కేకలు వేసింది’.. ఇక సూర్యాపేట నుంచి వచ్చిన భర్త కృష్ణ.. రక్తపు మడుగులో ఉన్న పాపను చేసి రోదించాడు. మునగాల సీఐ ఆంజనేయులు, మోతె ఎస్సై ప్రవీణ్ కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

   

Leave a Comment