చివరి ఖర్మలకూ క్యూ కట్టిన 42 శవాలు..!

కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తోంది. కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఆస్పత్రిలో బెడ్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మరణించన తర్వాత కూడా చివరి ఖర్మలు నిర్వహించేందుకు తిప్పలు తప్పడం లేదు. శ్మశాన వాటికకు పెద్దఎత్తున మృతదేహాలు అంత్యక్రియలకు వస్తున్నాయి. దీంతో వసతులు లేక శవాలను క్యూ లైన్ లో పెట్టి, మరి కొందరు అంబెలెన్స్ లు, కార్లలో ఉంచి గంటల కొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లోని హిండన్ మోక్ష స్థల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

 

ఘజియాబాద్ లోని శ్మశాన వాటిక వద్ద శుక్రవారం 42 మృతదేహాలు చివరి ఖర్మల కోసం నిలిచిపోయాయి. కుటుంబీకులను కోల్పోయి పుట్టుడు దుఖంలో ఉన్న వారికి దహన క్రియలకు స్థలం దొరక్కపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శ్మశాన వాటిక పనిచేయకపోవడం, మరో వైపు పెద్ద ఎత్తున మృతదేహాలు వస్తుండడంతో దహన సంస్కారాలకు వినియోగించే కలప ధరలు పెరిగిపోయాయి. 

ఇక గురువారం సైతం మోక్షస్థల్ వద్ద పెద్ద ఎత్తున మృతదేహాలు వచ్చాయి. దహనం చేసేందుకు రెండు మూడు గంటల సమయం పట్టింది. గత పది రోజులుగా హిండల్ మోక్ష స్థల్ వద్ద అంత్యక్రియలకు వచ్చే మృతదేహాల సంఖ్య భారీగా పెరగింది. నిన్న ఒక్కరోజే 35 మృతదేహాలకు దహన క్రియలు నిర్వహించారు. దీంతో ప్లాట్ ఫారాలన్నీ నిండిపోయాయి. 

Leave a Comment