1998 డీఎస్సీ: 25 ఏళ్లుగా ఎదురుచూసి.. దయనీయ స్థితిలో క్వాలిఫైడ్ అభ్యర్థి..!

ఒకటి రెండు కాదు.. ఏకంగా పాతికేళ్లు ఎదరుచూపులు.. ఈ ఎదరుచూపులతో కాలం కూడా కూడా కరిగిపోయింది.. అభ్యర్థులు కాస్త వృద్ధాప్యానికి చేరువయ్యారు.. ఇన్నాళ్లుకు వీరికి మోక్షం కలుగబోతుంది.. 1998 డీఎస్సీ అర్హులకు కాంట్రాక్ట్ ఉద్యోగాల కల్పనకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఈక్రమంలో ఉద్యోగం రాక, కుటుంబాన్ని కోల్పోయి రోడ్డు పాలైన ఓ యువకుడి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..  

అతడి పేరు కేదారీశ్వరరావు.. తూర్పు గోదావరి జిల్లా పాతపట్నం మండలం పెద్దసీదికి చెందినవాడు.. 1965లో జన్మించాడు.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుంచి బీఈడీ పూర్తి చేశాడు. కొన్నాళ్లు ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్ గా పనిచేశాడు. 33 ఏళ్ల వయసులో 1998 డీఎస్సీలో అర్హత సాధించాడు. ఇంకేముంది జీవితంలో స్థిరపడినట్లే అనుకున్నాడు. ఈ తరుణంలో డీఎస్సీ నియామకాలు వివాదంలో పడ్డాయి. 

అదే సమయంలో తండ్రి కూడా చనిపోయాడు. దీంతో తల్లితో కలిసి గ్రామంలోనే ఉండేవాడు. కొన్నాళ్లు ఆటో నడిపాడు. ఆ తర్వాత బట్టల షాపు పెట్టాడు. అది కలిసి రాకపోవడంతో పదేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడికెళ్లిన తర్వాత తల్లి కనిపించకుండా పోయింది. దీంతో కొన్నాళ్ల క్రితం ఒంటరిగానే గ్రామానికి వచ్చాడు. 

 ఉద్యోగం లేకపోవడం, ఒంటరితనం, ఆదరించే వారు లేకపోవడంతో మానసిక ఒత్తిడితో మతిస్థిమితం కోల్పోయాడు. రోడ్లపై తిరుగుతూ గ్రామస్తులు ఇచ్చింది తింటూ అక్కడే ఉంటున్నాడు. చినిగిన దుస్తులతో సైకిల్‌ మీద బట్టలు పెట్టుకుని వీధుల్లో తిరుగుతున్నాడు. 98 డిఎస్సీ అర్హత సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయం నేపథ్యంలో కేదారీశ్వరరావు కూడా ఆ జాబితాలో ఉంటాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఇదే గ్రామం నుంచి డిఎస్సీకి ఎంపికైన ముకుందరావు, మన్మథరావులు మిత్రుడి పరిస్థితి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

 

 

 

 

Leave a Comment