‘నా చావుకు హెడ్ మాస్టర్ కారణం’.. అంటూ విద్యార్థి సెల్ఫీ వీడియో..!

తమిళనాడులో విషాదం జరిగింది. ఓ యువకుడు ఎలుకల మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు హెడ్ మాస్టర్ కారణమంటూ సెల్పీ వీడియో తీసుకున్నాడు. వివరాల మేరకు తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం ప్రాంతానికి చెందిన విశాల్(16) తిరునగేశ్వరంలోని గవర్నమెంట్ హైస్కూల్ లో 11వ తరగతి చదువుతున్నాడు. విశాల్ ఇదే స్కూల్ లో 10వ తరగతి పూర్తి చేశాడు. 

పదో తరగతి చదువుతున్న సమయంలో పాఠశాలలో పెడుతున్న భోజనం బాగోలేదని హెడ్ మాస్టర్ సంపత్ కుమార్ కి విశాల్ ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో హెడ్ మాస్టర్ విశాల్ ను అవమానించాడు. దీంతో విశాల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో స్కూళ్లు మూతపడ్డాయి. పదో తరగతి విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసేసింది. 

మళ్లీ ఇటీవల స్కూళ్లు ప్రారంభమయ్యాయి. విశాల్ 11వ తరగతి చదువుకునేందుకు అదే స్కూల్ కు వెళ్తున్నాడు. టెన్త్ క్లాస్ లో జరిగిన ఘటనను విశాల్ మర్చిపోయాడు. కానీ ఆ హెడ్ మాస్టర్ మాత్రం మనసులో ఉంచుకుని విశాల్ పై కక్ష పెంచుకున్నాడు. అక్టోబర్ 15న స్కూల్ కి వెళ్లిన విశాల్ ను కారణం లేకుండానే హెడ్ మాస్టర్ సంపత్ విచక్షణారహితంగా కొట్టాడు. 

దీంతో మనస్తాపంతో విశాల్ క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ఎలుకల మందు పేస్ట్ తీసుకుని తిన్నాడు. ఆ సమయంలో సెల్ఫీ వీడియో తీసి తన చావుకు హెడ్ మాస్టర్ సంపత్ కారణమని చెప్పాడు. విశాల్ ను చికిత్స నిమిత్తం తిరునగేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కుంభకోణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తంజావూరు మెడికల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్టోబర్ 27న చికిత్స పొందుతూ విశాల్ ప్రాణాలు కోల్పోయాడు. 

ఈ ఘటనపై విశాల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హెడ్ మాస్టర్ సంపత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజుల్లో క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. యువత నుంచి పెద్దల వరకు సమస్యలు వస్తే చావే పరిష్కారం అని ఆలోచిస్తున్నారు.. కానీ ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది.. ఆత్మహత్య పరిష్కారం కాదు.. మీకు కూడా ఇలాంటి వారు తారసపడితే వారిని సముదాయించండి.. వారి ఆలోచన మారే విధంగా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్.. 

Leave a Comment