పోలవరంపై పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ

పార్లమెంటులో జలశక్తి శాఖ వెల్లడి

అమరావతి : రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై పర్యవేక్షణ కోసం కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు.కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో ఇది నడుస్తోంది. దీంతోపాటు పంజాబ్‌లోని షాపూర్‌కండీ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకూ వేరే కమిటీని నియమించింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. దేశవ్యాప్తంగా 16 సాగు నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించినట్లు తెలిపారు. వీటిలో పోలవరం, సరయూ నహర్‌ పరియోజన (ఉత్తర ప్రదేశ్‌), గోసీఖుర్ద్‌ ప్రాజెక్టు (మహారాష్ట్ర), తీస్తా బ్యారేజీ ప్రాజెక్టు (పశ్చిమ బెంగాల్‌ ), షాపూర్‌కండీ (పంజాబ్‌)లను ఆయా రాష్ట్రాలే సొంత పర్యవేక్షణలో నిర్మిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు చూస్తున్నప్పటికీ.. ఈ ప్రాజెక్టులకు ఆర్థిక, సాంకేతికపరమైన సహకారాన్ని కేంద్రమే అందిస్తోందన్నారు. జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాల పర్యవేక్షణ కోసం ఇప్పటికే హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ (హెచ్‌పీఎ్‌ససీ) ఉందని తెలిపారు. కానీ పోలవరం, షాపూర్‌కండీ పనుల తీరు పర్యవేక్షణకు ప్రత్యేకంగా జలసంఘం ఆధ్వర్యంలో కమిటీలను వేశామని చెప్పారు. కాగా ఇకపై జాతీయ స్థాయిలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాల్వల నిర్మాణాలు చేపట్టకుండా పైపులైన్ల ద్వారా మాత్రమే సాగుకు నీరందించాలని నిర్ణయించినట్లు మేఘ్వాల్‌ తెలిపారు. కాల్వల ద్వారా నీరిస్తే ఆవిరి నష్టాలు వస్తున్నాయని.. పైపులైన్లతో ఆ సమస్య ఉండదని చెప్పారు.

Leave a Comment