ఇక మొత్తం మార్చేస్తాం.. : జగన్

అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మొత్తం విద్యా వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ‘ది హిందు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతామన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తున్నామన్నారు.. ప్రారంభ దశలో కొన్ని ఇబ్బందులు వస్తాయని, వాటిని అధికమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఒకవైపు ఇంగ్లీష్‌ మీడియాన్ని తీసుకురావడంతో పాటు విద్యా వ్యవస్థలో మార్పుల కోసం నాలుగు కార్యక్రమాలు చేపట్టామన్నారు.. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పుడు 25వేల ప్రభుత్వ పాఠశాలల ఫోటోలు తీసి వచ్చే మూడేళ్లలో వాటి రూపురేఖలను మార్చబోతున్నామని జగన్ తెలిపారు.

ముఖ్యమంత్రికి అధికారాలు, బాధ్యతలు ఉంటాయి..

‘రాజధానిపై ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం తీసుకోకుంటే దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడుతుంది’ అని  సీఎం జగన్ అన్నారు. ముఖ్యమంత్రికి అధికారాలు, బాధ్యతలు ఉంటాయన్నారు. ‘ ప్రస్తుతం రాజధానిగా చెబుతున్న ప్రాంతంలో కనీసం సరైన రోడ్లు కూడా లేవు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు రాజధాని ప్రకటన కంటే ముందే భూములు కొనుగోలు చేశారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా అభివృద్ధి చేసుకోవచ్చు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది. ఏపీలో విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం. పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంది. విశాఖలో మౌలిక వసతులన్నీ ఉన్నాయి. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుంది. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1.09 లక్షల కోట్లు కావాలి. కీలక మౌలిక సదుపాయాలకు ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. ఇంత ఖర్చుతో అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టం’ అని జగన్ స్పష్టం చేశారు.

Leave a Comment