రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరు..!

ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో ముగినిపోయింది. ఆయనకు భార్య శ్యామలాదేవి, కుమార్తెలు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ఉన్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు.  

తెలుగు చిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రెబల్ స్టార్. కృష్ణంరాజు చిలకా గోరింకా చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. ‘అవేకళ్లు’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు. ఆ తర్వాత ‘కృష్ణవేణి’, భక్త కన్నప్ప, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం లాంటి హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా మారారు. ‘తాండ్రా పాపారాయుడు’ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆయన సినీ కెరీర్ లో ఐదు ఫిలింఫేర్ అవర్డ్స్ సౌత్, మూడు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకున్నారు. 

సెప్టెంబర్ 5న  కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆస్పత్రిలో చేరారని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతిందని, వెంటిలేటర్ పై చికిత్స అందించామని పేర్కొన్నారు. అయితే ఇవాళ అర్ధరాత్రి సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో పరిస్థితి విషమంగా మారి తెల్లవారుజామున మరణించారని వైద్యులు వెల్లడించారు.  కృష్ణంరాజు అంత్యక్రియలను హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భౌతిక కాయాన్ని ఇంటికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఫిలింఛాంబర్ కు అభిమానుల సమదర్శనార్థం తీసుకొస్తారు. మధ్యాహ్నం తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

Leave a Comment