విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు..

జులై 15 తర్వాత టీచర్ల బదిలీలు

విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏయే పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న దానిపై మ్యాపింగ్ చేయాలని సూచించారు. బుధవారం ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల అవసరాలే ప్రాతిపదికగా బదిలీలు చేపట్టాలని సీఎం సూచించారు. టీచర్ల బదిలీలను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తామని, జులై 15 తర్వాత బదిలీలు చేపడతామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. 

పిల్లల ప్రతిభపై నిరంతర అధ్యయనం..

పిల్లలు నేర్చుకునే విధానం, వారికి చూపిస్తున్న ప్రతిభపై నిరంతరం అధ్యయనం జరగాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.  6వ తరగతి నుంచి 10 తరగతి వరకూ వివిధ పాఠశాల్లలో విద్యార్థుల ప్రతిభపై నిరంతరం అధ్యయనం చేయాలన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువులు అందడానికి నిర్ణయాలు తీసుకోవడంలో విప్లవాత్మకంగా ఆలోచించాలని  అధికారులకు స్పష్టం చేశారు. డిజిటల్‌ లెర్నింగ్‌ కోసం సమగ్రంగా యాప్‌ రూపకల్పన చేయాలని సీఎం ఆదేశించారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ సదుపాయం కూడా ఉండేలా చూడాలన్నారు. 

పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమాలపై సమీక్ష..

నాడు – నేడు కార్యక్రమాల్లో నాణ్యతను ఎలా పెంచాలన్న దానిపై దృష్టి పెట్టాలని, దీని కోసం ఒక విధానాన్ని రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున, జూలై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్నారు.  గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌నూ భాగస్వామ్యం చేయాలన్నారు. 

గోరుముద్దలో నాణ్యత ఉండాలి..

 గోరుముద్ద కింద పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజనం ఏ స్కూల్లో చూసినా ఒకటే నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. వీటికిచ్చే పేమెంట్ల విషయంలో ఎలాంటి ఆలస్యం ఎండకూడదన్నారు. జేసీలు, కలెక్టర్లు మధ్యాహ్న భోజనంపై నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. స్కూల్లో సదుపాయాలపై ఒక టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని, ఏ సమస్య వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆ నంబర్ కు ఫోన్ చేసేలా నంబర్లను ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షకు ముందు, ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న బల్లలు, ఇతర ఫర్నీచర్‌ను సీఎం పరిశీలించారు.

ఏవేవి ఎన్నెన్ని?

మనబడి నాడు–నేడులో భాగంగా తొలి దశలో 15,715 స్కూళ్ల సమూల మార్పులో భాగంగా వాటిలో మొత్తం 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. వీటిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కొనుగోళ్లు ప్రారంభించింది. 

  •  1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు 1.50 లక్షల బల్లలు
  • 4వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మరో 1.50 లక్షల బల్లలు
  • 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డ్యుయల్‌ డ్రాలతో కూడిన 2.10 లక్షల బల్లలు.
  • టీచర్ల కోసం 89,340 టేబుళ్లు, కుర్చీలు
  •  72,596 గ్రీన్‌ చాక్‌ బోర్డులు
  •  16,334 అల్మారాలు
  • 1,57,150 సీలింగ్‌ ఫ్యాన్లను కొనుగోలుకు ఇప్పటివరకూ టెండర్లు ఖరారు చేసింది. 

రివర్స్‌ టెండరింగ్‌–ఆదా:

ఈ వస్తువులు, పరికరాల కోసం దాదాపు మొత్తం రూ.890 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. శానిటరీ ఐటెమ్స్‌ కాకుండా మిగతా వాటికి టెండర్లు కూడా ఖరారు చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటి వరకూ రూ.144.8 కోట్లు ఆదా చేశారు. 

సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌:

కావాల్సిన వస్తువులు, ఫర్నిచర్‌.. తదితర వాటి కొనుగోలు కోసం సెంట్రలైజ్జ్‌ ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లడం ద్వారా సమయానికి వాటిని పొందడమే కాకుండా, నాణ్యత ఉంటుందని, బిడ్డింగ్‌లో పోటీ కారణంగా తక్కువ ధరకే లభ్యమయ్యే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. 

ఎక్కడా రాజీ వద్దు

గవర్నమెంటు స్కూళ్లలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఫర్నీచర్‌ ఏర్పాటు చేయడమే కాదు, వాటి నిర్వహణ కూడా ఎంతో ముఖ్యమన్న ఆయన పలు సూచనలు చేశారు.

 

Leave a Comment