రంగుల ఖర్చును వైసీపీ నుంచే రాబట్టాలి : చంద్రబాబు 

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసినందుకు వాటిని తొలగించడానికి అయ్యే ఖర్చును వైసీపీ నుంచే వసూలు చేయాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు డిమాండ్ చేశారు. గతంలో దీనిపై వాదనల సందర్భంగా కోర్టులు కూడా అదే చెప్పాయన్నారు. వృధా చేసిన ప్రజాధనాన్ని వైసీపీ నుంచి, వాళ్ల తప్పులకు తందాన అనే అధికారుల నుంచి రాబట్టాలన్నారు. చేసిన తప్పుకు మూల్యం వైసీపీనే చెల్లించాలని చంద్రబాబు కోరారు. 

   పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు కలిగిస్తుందో రంగుల ఉదంతమే రుజువని చంద్రాబుబు తెలిపారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండా రంగులు వేయడం వైసిపి మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు.  ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ ఉల్లంఘనలు, న్యాయ నిబంధనల (రూల్ ఆఫ్ లా) ఉల్లంఘన, కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించడం… ఏడాది పాలనలో వైసీపీ ప్రభుత్వం నూరు తప్పులు చేసిందని చెప్పారు. 

‘దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేసిన చరిత్ర లేదు. ఆ దురాలోచనే ఏ పార్టీ, ఏ నాయకుడు చేయలేదు. అన్నివర్గాల ప్రజలు హాజరయ్యే ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసే దుస్సంప్రదాయానికి ఎవరూ తెగించలేదు. అన్నివర్గాలకు న్యాయం చేసే తటస్థ వేదికలుగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయ భవనాలకు పార్టీ రంగులేయడం అనైతికం. అందరిదీ ఒకదారి అయితే వైసిపిది మరోదారి, అదే ‘‘అడ్డదారి-మాయదారి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

 

Leave a Comment