కరోనాతో చావు అంచుల వరకు వెళ్లిన బాడీ బిల్డర్..!

కరోనా మహమ్మారి ఎంతటి వారినైనా ఇట్టే తన వశం చేసుకుంటోంది. ఉక్కు లాంటి మనిషిని సైతం కరోనా పిండి చేసేస్తోంది. దారుణంగా దెబ్బ తీయటమే కాదు.. వారి ప్రాణాల మీదకు తీసురావడం ఖాయం.. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక బాడీ బిల్డర్.. కరోనా బారిన పడి.. మృత్యుముఖం వరకు వెళ్లి వచ్చాడు. 

మల్కాజిగిరికి చెందిన 32 ఏళ్ల సుశీల్ కుమార్ గైక్వాడ్ తెలంగాణ రాష్ట్రం తరఫున బాడీ బిల్డింగ్ క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఏప్రిల్ చివరిలో కరోనా బారినపడిన సుశీల్ చికిత్స కోసం స్థానిక ఆస్పత్రిలో చేరాడు. అతడికి ఓ దశలో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. 

సుశీల్ ను ఆక్సిజన్ సౌకర్యం ఉన్న మరో ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావించినా బెడ్లు దొరకలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే నటుడు సోనూసూద్ సాయం కోరారు. ఆయన వెంటనే స్పందించడంతో మే 19న సుశీల్ కుమార్ మలక్ పేటలోని యశోద ఆస్పత్రిలో చేరాడు. 

అప్పటికే అతడి ఊపిరితిత్తులు 80 శాతం ఇన్ ఫెక్షన్ కు గురైనట్లు వైద్యులు గుర్తించారు. సుదీర్ఘ చికిత్స అనంతరం ఎక్మో చికిత్స అవసరం లేకుండానే సుశీల్ కోలుకున్నాడు. దీంతో తాజాగా సుశీల్ డిశ్చార్జ్ అయ్యాడు. కోవిడ్ సోకకముందు 100 కిలోలకు పైగా ఉన్న సుశీల్ కుమార్ ప్రస్తుత బరువు 72 కిలోలకు తగ్గిపోయాడు. ఇది చూస్తే కరోనాకు ఎవరూ అతీతీ కాదనే విషయం స్పష్టం అవుతోంది..

Leave a Comment