ఆశయం కోసం.. రోజూ అర్ధరాత్రి 10 కి.మీ. పరుగు..!

అర్ధరాత్రి అయితే అందరూ ఏం చేస్తారు? హాయిగా నిద్రపోతారు.. కొందరు యువకులు మొబైల్ ఫోన్లలో.. మిడ్ నైట్ రోడ్ల మీద బైక్ రేసింగులు చేస్తుంటారు.. కానీ నోయిడాకు చెందిన 19 ఏళ్ల ప్రదీప్ మెహ్రా అనే యువకుడు మాత్రం అర్ధరాత్రి  ఆశయం కోసం పరిగెడుతూ ఉంటాడు. ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటలకు భుజానికి బ్యాగ్ వేసుకొని రన్నింగ్ చేస్తూ వెళ్తుంటాడు.. నోయిడా రోడ్లపై ఆగకుండా పరిగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కుర్రాడు ఓవర్ నైట్ హీరో అయిపోయాడు..

ప్రముఖ డైరెక్టర్ వినోద్ కాప్రీ కారులో వెళ్తుండగా.. అర్ధరాత్రి 12 గంటలకు ఓ యువకుడు రోడ్డుపై పరిగెత్తుతూ ఆయన కంటపడ్డాడు. ఆ యువకుడు ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడనుకొని లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. అందుకు ఆ యువకుడు నిరాకరించాడు. ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకోలేదు. నేను రోజూ పరిగెత్తుకుంటూనే ఇంటికెళ్తానని చెప్పాడు. ఇలా ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగితే.. ఆ యువకుడు చెప్పిన సమాధానానికి డైరెక్టర్ తో పాటు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

‘నాపేరు ప్రదీప్ మెహ్రా.. నేను సెక్టార్ 16లోని మెక్ డొనాల్డ్స్ లో పనిచేస్తాను. మా అమ్మకు ఆరోగ్యం బాగా లేక ఆస్పత్రిలో ఉంది. ఆర్మీలో చేరాలనేది నా కల.. అందేకే సాధన చేస్తున్నాను. ఉదయం రన్నింగ్ చేసేందుకు టైమ్ ఉండదు. అందుకే పని అయిపోయిన తర్వాత రాత్రి పరిగెత్తుతాను. ప్రతిరోజూ 10 కిలోమీటర్ల దూరం పరిగెడుతూ ఇంటికి వెళ్తాను’ అని యువకుడు సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోను వినోద్ కాప్రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఆశయ సాధన కోసం శ్రమిస్తున్న ప్రదీప్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  

 

 

Leave a Comment