కరోనా విముక్తికి నాతో కలిసి పనిచేయండి : కేఏ పాల్

కరోనా వైరస్ ను చైనాలోని వూహాన్ నుంచి ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేసినట్లు సమాచారం ఉందని తాను ముందే చెప్పానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పారని, కానీ ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. దాదాపు 40 శాతం కేసులు న్యూయార్క్ లో ఉన్నాయని, ఇండియాలో 10 శాతం కేసులు ఉంటాయని స్పష్టం చేశారు. అమెరికాలో ఉన్న ఆయన తన సందేశాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు.తనకు చెందిన భవనాలను ఉపయోగించుకోవాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను తాను కోరానని, అయితే స్పందన రాలేదని చెప్పారు. 

కరోనాను విముక్తి కోసం తనతో 62 దేశాలు కలిసి పని చేస్తున్నాయని పాల్ చెప్పారు. తెలుగు రాష్ట్రాలు కూడా తనతో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. అయితే తెలుగు మీడియాలో తన సందేశానికి చోటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12 కోట్ల తెలుగు ప్రజలకు తనంటే అభిమానమని అన్నారు. 

నన్న చంపించాలని చూశారు..

ఇక నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణ రాజు ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ చేయలేదని, అందుకే ఆయనకు ఆ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఆయన తనను చంపించాలని చూసినట్లు సంచలన ఆరోపణలు చేశారు. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. తనను గెలిపించి ఉంటే అభివృద్ధి అంటే ఏమిటో చూపించేవాడినని అన్నారు. ప్రపంచంలో తాను ఏడు పెద్ద యుద్ధాలు ఆపానని, వెయ్యి కోట్ల మంది ప్రానాలు దేవుడు తన ద్వారా రక్షించాడని అన్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా ఉందని తెలిసిందని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించానని పాల్ అన్నారు. ఆయన ఆఫీసులోనే 24 మందికి కరోనా ఉన్నట్లు తెలిసిందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

 

 

Leave a Comment