ఇది కోవిడ్ తో కలిసి బతకాల్సిన సమయం : సీఎం జగన్

కరోనా పరీక్షల్లో రాష్ట్రం రికార్డు సృష్టించిందని, రాష్ట్రంలో 10 లక్షలకు పైగా కోవిడ్‌ టెస్టులు చేశామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అందుకు అధికారులు, కలెక్టర్లను ఆయన అభినందించారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా అధికారులు, కలెక్టర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా వైరస్ పై సమీక్షించారు. ఒకప్పుడు కనీసం రెండు మూడు టెస్టులు కూడా చేయడానికి ఇబ్బందే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా రోజుకు సగటున 22 వేల నుంచి 25 వేల వరకు టెస్టులు చేయగలుగుతున్నామని గుర్తు చేశారు.

హోం ఐసోలేషన్‌ అన్నది చాలా ముఖ్యమైన అంశం అవుతుందన్న ముఖ్యమంత్రి 85 శాతం కేసులు ఇంట్లోనే నయం అవుతున్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉందని తెలిపారు. హోం ఐసోలేషన్‌కు రిఫర్‌ చేసే వారిని బాగా చూసుకుంటున్నామా?. లేదా?. మందులు సరిగ్గా అందుతున్నాయా?. లేదా?. అన్నది చూసుకోవాలని ఆదేశించారు. గ్రామ సచివాలయంలో ఉన్న హెల్త్‌ అసిస్టెంట్, ఆశా వర్కర్, ఏఎన్‌ఎంలు వారి హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి ఇళ్లకు వెళ్లి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని, అవసరమైన మందులు ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్దేశించారు.

అలాగే జిల్లా స్థాయిలో ఉన్న కోవిడ్‌ కంట్రోల్‌ రూం బాగా పని చేయాలని, ఆ యంత్రాంగం కూడా మెరుగ్గా పని చేయాలని కోరారు. హోం ఐసోలేషన్‌ మీద కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. హోం ఐసోలేషన్‌ కోసం ఇండివిడ్యువల్‌గా ఇంట్లో ప్రత్యేక గది లేని వారి కోసం కోవిడ్‌ కేర్‌ సెంటర్లు పెట్టామని, ఆ కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన సేవల మీద దృష్టి పెట్టాలని సూచించారు. బెడ్లు, టాయిలెట్లు, మెడికేషన్, ఆహారం.. ఈ నాలుగు అంశాల మీద అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే కోవిడ్‌ అనుమానితుల కోసం కూడా ఇస్తున్న క్వారంటైన్‌ సదుపాయాలు కూడా బాగుండాలని నిర్దేశించారు. ఇది కోవిడ్‌తో కలిసి బతకాల్సిన సమయమని, వ్యాక్సిన్‌ కనుగొనేంత వరకూ జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ చెప్పారు.

అవగాహన కల్పించాలి

దేశంలో అన్ని రాష్ట్రాల సరిహద్దులు తెరిచారని, అలాగే కొన్ని చోట్ల నుంచి అంతర్జాతీయ విమానాలు కూడా నడుస్తున్నాయని, దీని వల్ల సహజంగానే కేసులు పెరుగుతాయని, అంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే కేసులు ఉన్నప్పుడు ప్రజల్లో ఉన్న భయాందోళన తొలగిపోయి వారిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘కోవిడ్‌ సోకితే , కోవిడ్‌ ఉన్నట్టుగా అనిపిస్తే.. ఎవరికి కాల్‌ చేయాలి?. ఏం చేయాలి?. ఎక్కడకు వెళ్లాలి?. అన్న దానిపై ప్రతి ఒక్కరికి తెలియాలి. దీని వల్ల ప్రజలు వైద్యం చేయించుకోవడం సులభం అవుతుంది. ప్రజల్లో చైతన్యం కలిగించడం మీద దృష్టి పెట్టాలి. ఆ మేరకు వారికి అవగాహన కల్పించాలి. అన్నింటిపై విస్తృతంగా ప్రచారం చేయాలి’ అని సీఎం పేర్కొన్నారు.

 

Leave a Comment