మానవత్వం మరిచారు.. మెట్రోలో అమ్మకు చోటివ్వని మహిళలు..వీడియో వైరల్.. !

ఆమె ఓ చంటి బిడ్డకు తల్లి. హైదరాబాద్ లో చంటి బిడ్డను ఎత్తుకుని మెట్రో రైలు ఎక్కింది. సీట్లన్నీ నిండిపోయాయి. ఆ బోగీలో అందరూ మహిళలు, యువతులే ఉన్నారు. అయితే బిడ్డను ఎత్తుకుని ఉన్న ఆమెకు సాటి మహిళలు కూడా సీటు ఇవ్వలేదు. పైగా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని.. మొబైల్ ఫోన్స్ లో బిజీగా ఉన్నారు. ఒక్కరు కూడా ఆమెకు సీటు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ తల్లి మెట్రో ట్రైన్ లో చంటి బిడ్డతో పాటు కింద కూర్చుని ప్రయాణించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

చంటిబిడ్డతో రైలు ఎక్కి కింద కూర్చుని ప్రయాణించిన ఆమెను చూసి నెటిజన్లు బాధపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. సాటి మహిళలే ఆమె సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద చదువులు పూర్తి చేసిన మహిళలు కనీస మానవత్వం చూపకపోవడం దారుణమంటున్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్.వి.ఎన్.రెడ్డి స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. తోటి ప్రయాణికులు ఆ తల్లికి సీటిచ్చి సహకరించాల్సిందని పేర్కొన్నారు. అలా చేయకపోవడం బాధాగా అనిపించిందన్నారు. మనం కట్టుబడి ఉన్న సామాజిక విలువలను ప్రశ్నించేదిగా ఉందన్నారు. పసికందు భద్రంగా పట్టుకుని కింద కూర్చుని ప్రయాణించిన ఆమెలో నిజమైన భారతీయ మాతృ హృదయ గొప్పతనం కనిపించిందని అన్నారు.    

Leave a Comment