కట్నం వేధింపులకు గర్భిణి బలి..!

మరి కొద్ది నెలల్లో తల్లి కావాల్సిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. వరకట్నం వేధింపులతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతరపురం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన బాబా ఫకృద్దీన్ కు కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన రిజ్వానాతో 14 నెలల క్రితం వివాహం అయింది. 

పెళ్లి సమయంలో 15 తులాల బంగారంతో పాటు రూ.1.5 లక్షలు కట్నంగా ఇచ్చారు. అయితే పెళ్లి అయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం బాబా ఫకృద్దీన్ వేధించేవాడు. భర్తకు తోడుగా అత్తమామలు, ఆడపడుచే కాకుండా, మరిది కూడా అదనపు కట్నం తీసుకురావాలని వేధించావారు. 

వీరి వేధింపుల గురించి రిజ్వానా తమ తల్లిదండ్రులకు చెప్పడంతో పంచాయతీ చేశారు. చివరకు మూడు నెలల క్రితం నుంచి అనంతపురం నగర శివారులోని ఎర్నాటకొట్టాలలో ఓ అద్దె ఇంట్లో వేరు కాపురం పెట్టారు. ప్రస్తుతం రిజ్వానా రెండు నెలల గర్భిణీ. బాబా ఫకృద్దీన్ తన తండ్రి వద్దే వెల్డింగ్ పనిచేస్తాడు. రోజులాగే శుక్రవారం కూడా పనికి వెళ్లి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. 

అయితే ఎన్ని సార్లు పిలిచినా రిజ్వానా పలకకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా, రిజ్వానా ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించింది. స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. రిజ్వానా తల్లిదండ్రులు అల్లుడు, అతగి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

Leave a Comment