విశాఖ స్టీల్ ప్రైవేటుకే.. తేల్చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి..!

విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సితారామన్ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా స్టీల్ ప్లాంట్, దాని అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్ సంస్థలను ప్రైవేటీకరించనున్నట్లు తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వ వాటా ఉపసంహరించుకోవడం ద్వారా స్టీల్ ప్లాంట్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన మూలధనం సమకూరడంతో పాటు, సామర్థ్యాన్ని విస్తరించవచ్చని తెలిపారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ నిర్వహణ పద్ధతులు అందుబాటులోకి వస్తాయని, ఫలితంగా ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వివరించారు. 

ప్రైవేటీకరణ, ప్రభుత్వ వాటా విక్రయం జరిపే క్రమంలో సంస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ఇతర భాగస్వాముల న్యాయపరమైన ప్రయోజనాలు తగిన విధంగా కాపాడేలా షేక్ పర్చేజ్ అగ్రిమెంట్లో నిబంధనలు పొందుపర్చనున్నట్లు నిర్మల వెల్లడించారు. విశాఖ ఉక్కులో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమైనప్పుడు, ఆ ప్రత్యేక పరిస్థితుల్లో సమకారాన్ని కోరుతామని తెలిపారు. 

Leave a Comment